బీజేపీకి చెలగాటం.. ఆప్ కు ప్రాణ సంకటం

0
125

 Posted April 30, 2017 at 11:27

aam aadmi party worries about cmదేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మాంచి ఊపు మీదున్న బీజేపీని.. రెండేళ్ల క్రితం ఢిల్లీలో కోలుకోలేని దెబ్బ తీశారు కేజ్రీవాల్. 70 సీట్లలో 67 సీట్లు గెలిచి రికార్డు సృష్టించారు. దీంతో ఇక ఢిల్లీ ఆప్ కంచుకోట అయిందని అందరూ భావించారు. కానీ రెండున్నరేళ్లు తిరిగే సరికి సీన్ రివర్సైంది. మున్సిపల్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెల్చిన బీజేపీ.. కేజ్రీవాల్ తో అమీతుమీ తేల్చుకుంటోంది. కేజ్రీవాల్ పై మెజార్టీ ఆప్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని వాదన షురూ చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం మొదలైంది.

ఇప్పటికే ఢిల్లీ మున్సిపోల్స్ ఓటమితో ఆప్ లో అంతర్మథనం మొదలైంది. ఏ ఆటోరిక్షా వాలాలు తమకు ఓటేశారో వారు కూడా మీడియాలో కేజ్రీవాల్ ను విమర్శించడం ఆప్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఆటోస్టాండ్లు కూడా ఇవ్వని కేజ్రీవాల్ కు ఎందుకు ఓటేయాలని వారేసిన సూటి ప్రశ్న.. ఆప్ నేతలు గళం విప్పేలా చేసింది. ఈవీఎంలపై నిందలు మానేసి.. స్వీయ లోపాలు సరిదిద్దుకోవాలని నేతలు కేజ్రీవాల్ కు గట్టిగా చెప్పారు. దీంతో కేజ్రీవాల్ కూడా ఆలస్యంగా నిజం ఒప్పుకున్నారు. కొన్ని తప్పులు చేశామని అతి కష్టం మీద ఒప్పుకున్నారు.

కేజ్రీవాల్ ను దెబ్బకొట్టాలని చూస్తున్న బీజేపీ.. ఇదే మంచి సమయమని చూస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలు సీఎం కేజ్రీవాల్ ను తొలగించి కుమార్ విశ్వాస్ ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేజ్రీ సర్కారును కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అందుకే ఇలాంటి ఫీలర్లు వదులుతోందని చెబుతున్నారు. దీంతో కేజ్రీ గుండెల్లో కలవరం మొదలైంది. ఇల్లు చక్కదిద్దుకోకపోతే అసలుకే ఎసరు వస్తుందని భావించి.. సీనియర్లతో వరుస సమావేశాలు జరుపుతూ టెన్షన్ గా కనిపిస్తున్నారు.