పవన్ సభ వెనుక అమిత్ షా ?

amith shah behind pavan house

పవన్ సభ వెనుక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హస్తముందా? ఇలా అడగ్గానే ఈ ప్రశ్నకి అర్ధం ఉందా అనుకోవడం సహజం. ఇది అర్ధంలేని సందేహమనుకుంటారు కూడా.. ఎవరైనా సభ పెట్టించిమరీ తమను తామే తిట్టించుకుంటారా? ఈ ప్రశ్నకి సాధారణ విషయాల్లో అయితే వెంటనే నో అంటాము. కానీ రాజకీయాల్లో అలాకాదు. అక్కడ ఏదైనా జరగొచ్చు.

పవన్ సభ వెనుక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఉండొచ్చన్న సందేహం గాలిలో పుట్టినట్టు అనిపించవచ్చు.దానికి సాక్ష్యాలు,రుజువులు కనిపించకపోవచ్చు.కానీ హేతుబద్ధంగా,రాజకీయకోణంలో ఆలోచిస్తే …అందులో ఉన్న గుట్లు,లోగుట్లు అర్ధమవుతాయి.

ఆంధ్రాలో పాగావేయాలని కమలనాధులు ఎప్పటినుంచో కలలు కంటున్నారు.అయితే మిత్రపక్షం గా వ్యవహరిస్తున్న తెలుగుదేశం ఆ ఒక్కటి తప్ప అన్నట్టు ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా బీజేపీని నిలవరిస్తోంది.ప్రత్యేక హోదా అంశం ఇంకాస్త కలిసొచ్చింది.దాన్ని అస్త్రంగా మలుచుకున్న చంద్రబాబు కేంద్రం మీద ,బీజేపీ మీద ఇటీవల ఒత్తిడి పెంచగలిగారు.ఒకవేళ బాబు ఒత్తిడికి తలొగ్గి ప్రత్యేక హోదా ఇస్తే ఆ క్రెడిట్ కూడా టీడీపీ కొట్టేస్తుంది.బాబు బలపడితే జాతీయస్థాయిలో మోడీకి ఆయన పోటీ కావొచ్చేమో …ఈపరిస్థితుల్లో హోదా అస్త్రాన్ని బాబు నుంచి లాక్కుంటే అని అమిత్ ఆలోచించవచ్చు.అందులో నుంచే ప్రత్యామ్నాయ శక్తి అన్న ఆలోచన వచ్చిందట.ఆ శక్తిని ఎలా సృష్టించాలి?ఆ దిశగా అమిత్ దృష్టి పెట్టినపుడు క్షేత్రస్థాయి పరిస్థితులు ఆయనకీ అవగాహన అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తే అక్కడ కుల ప్రభావం ఎక్కువనేది సుస్పష్టం.మెజారిటీ కమ్మలు తెలుగుదేశం వైపు,మెజారిటీ రెడ్లు వైసీపీ వైపు వున్నారు.సంఖ్యాపరంగా ఈ ఇద్దరి కన్నా ఎక్కువున్న కాపులు దగ్గరైతే ,వారి మద్దతు కూడగట్టగలిగితే మూడో ప్రత్యామ్నాయం సాధ్యమవుతుందని అమిత్ భావించివుండొచ్చు.కానీ వారిని ఆకర్షించే సమ్మోహన శక్తి బీజేపీ కి లేదు.అప్పుడే పవన్ కళ్యాణ్ వారికి ఆశాదీపంలా కనిపించి ఉండొచ్చు.అయితే అయన అప్పటికే జనసేన ఏర్పాటు చేసుకున్నారు.ఇప్పటిదాకా హోదా అంశంలో బెట్టు చూపి ఇప్పుడు బాబు ఒత్తిడికి తలొగ్గడం కన్నా పవన్ పోరాటానికి లొంగినట్టుంటే …బీజేపీ కికావాల్సిన పని జరిగిపోతుంది.హోదా ఇచ్చినా క్రెడిట్ బాబుకి రాదు.పోరాడిన పవన్ తో జతకలిస్తే ఎన్నికలకు వుపయోగపడుతుంది…..ఈ దిశగా అమిత్ ఆలోచించివుంటారు.

ఒక్కసారి పవన్ ప్రత్యేకహోదా అంశాన్ని భుజానికెత్తుకుంటే …బాబుకి అస్త్రం లేకుండా పోతుంది.అప్పుడు హోదా ఇస్తే పవన్ హీరో అవుతాడు.బాబు డిఫెన్స్ లో పడతాడు.కమలదళం చేస్తున్న ఈ ఆలోచనకి పవన్ ఎందుకు ఒప్పుకుంటారన్న సందేహం రావచ్చు.కానీ తిరుపతి సభలో హోదా అంశాన్నే ప్రధానంగా ఎత్తుకున్న పవన్ ప్రస్తుతం అది ఇవ్వగలిగిన స్థితిలో వున్న బీజేపీని మాత్రమే టార్గెట్ చేయాలి.కానీ ఆయన అందర్నీ కలిపి తిట్టేసారు.పైగా బీజేపీ లో చేరను అన్నారు గానీ..హోదా ఇస్తే కలిసి పనిచేయనని ఎక్కడా చెప్పలేదు.గత ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు అవసరం కాబట్టే బీజేపీని బలపరిచినట్టు చెప్పారు.పవన్ కి మళ్లీ అదే వాదన వినిపించే ఛాన్స్ వుంది.పైగా హోదా సాధించిన క్రెడిట్ వస్తుంటే ఎవరు కాదంటారు?పవన్ అందుకు మినహాయింపేమీ కాదు .ఎప్పటినుంచో అధికారం కోసం ప్రయత్నిస్తున్న ఓ ప్రధాన వర్గం ఆకాంక్ష నెరవేర్చిన క్రెడిట్ బోనస్ గా వస్తుంది.ఇవన్నీ ఆలోచించినప్పుడు… జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలించినప్పుడు… పవన్ సభ వెనుక అమిత్ షా వుండే అవకాశాల్ని కొట్టిపారేయలేం . ఏమంటారు ?