బాబు చూపిన అరకురుచి..కలెక్టర్లు ఖుషీ

Posted October 3, 2016

araku coffee tasteచూడ్డానికి సీరియస్ గా కనిపించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆతిధ్యం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.కానీ ఇటీవల కలెక్టర్లు కాన్ఫరెన్స్ సందర్భంగా అయన ఏర్పాటు చేసిన కాఫీ మీద అధికారుల్లో పెద్ద చర్చ జరిగింది.ఓ కప్పు కాఫీ గురించి అంతలా చెప్పుకోడానికి ఏముంటుంది? కానీ ఆ కాఫీ రుచి చూసిన వాళ్ళు దానిపై మాట్లాడకుండా ఉండలేకపోయారు.ఆ కాఫీ పొడి విదేశాలనుంచి ఏమన్నా తెచ్చారా అనుకున్నారు.అయితే అరకులో పండిన కాఫీ అని తెలిసేసరికి ఆశ్చర్యపోయారు.వెంటనే విశాఖ కలెక్టర్ ని అరకు కాఫీ గురించి ఆరా తీశారు.పనిలోపనిగా కాఫీ పొడి కావాలని అడగడంతో పాటు దాని మార్కెటింగ్ బాగా చేస్తే అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు వస్తాయని చెప్పారు.

అరకు లోయ ప్రకృతి అందాలకు నెలవు.ఆ సహజసిద్ధ అందాలే ఇప్పటిదాకా అరకు ఆభరణాలు.ఆ వన్నెలు చూసేందుకు వచ్చే పర్యాటకులు అరకు బిడ్డలకి రాజపోషకులు.అయితే నెమ్మదిగా ఆ పరిస్థితి మారబోతోంది.కాఫీ సమీప భవిష్యత్ లో అరకు బ్రాండ్ గా మారబోతోంది.అరకు వాతావరణం కాఫీ,ఆపిల్ సాగుకి అనుకూలంగా ఉండటంతో ప్రయోగాత్మకంగా వాటి సాగు మొదలైంది.కాఫీ మార్కెట్ లోకి కూడా వచ్చింది.మంచి ఆదరణ పొందుతోంది.బాబు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తో ఆ విషయానికి ఉన్నతాధికారుల ద్వారా ప్రచారం కూడా లభిస్తోంది.