నా మాటల్లో బాబు బంగారం..

  babu bangaram movie about my words

తెలుగు ప్రేక్షకులు ‘విక్టరీ వెంకటేష్’ ను పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా చూసి చాలా కాలమైంది. ‘గోపాల గోపాల’ చిత్రం తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన ‘బాబు బంగారం’ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ తో మనముందుకొచ్చారు. ‘మారుతి’ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…ఎన్నో అంచనాల మధ్య బాబు బంగారం చిత్రం భారీగా రిలీజ్ అయింది. మారుతి మార్క్ ,వెంకటేష్ క్లీన్ కామెడీతో సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది.ఈ సినిమా కథను చూసుకున్నట్లయితే.నయనతార తండ్రి మురళి శర్మ ఓ మర్డర్ ని వీడియో రికార్డ్ చేస్తాడు. దీంతో ఆ హత్యకు సంబందించి సంపత్ రాజ్, పోసాని లు అతని కోసం వెతుకుతూ అతని కూతురైన నయనతారను ఇబ్బంది పెడుతుంటారు.

అదే టైమ్ లో ఏసీపీ కృష్ణ అయిన వెంకటేష్ ఆ కేసును టేకప్ చేసి రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు.అదే టైములో వెంకీ..నయన ప్రేమలో పడతాడు. కానీ కొన్ని కారణాల వల్ల నయన మాత్రం వెంకీ కేసు కోసమే తనని ప్రేమించాడని అనుకుని అతనితో లవ్ బ్రేకప్ చేసుకుంటుంది. దాని తరువాత కృష్ణ తన కేసును సీరియస్ గా ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు ? అసలు నేరస్థుల్ని ఎలా పట్టుకున్నాడు ? తన ప్రేమను తిరిగి ఎలా గెలుచుకున్నాడు ? అనేదే ఈ సినిమా కథ.
సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది ‘వెంకటేష్’ గురించి. చాలా గ్యాప్ తరువాత వెంకటేష్ తన ట్రేడ్ మార్క్ ఫన్నీ రోల్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఏసీపీ కృష్ణ పాత్రలో ఆయన నటన బాగా నవ్వించింది.

సెకండ్ హాఫ్, క్లైమాక్స్ సన్నివేశాల్లో వెంకటేష్ తన నటనలో చూపించిన వేరియేషన్ చాలా బాగుంది. నయనతార నటన కన్నా ఆమె లుక్ చాలా బాగుంది. వెంకటేష్ తో ఆమె కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. పాటలు కూడా బాగున్నాయి. సినిమా మొదటి భాగం మొత్తం ఎంటర్టైనింగ్ గా సాగుతూ ఉల్లాసభరితంగా ఉంది. 30 ఇయర్స్ పృథ్వీ ‘బత్తాయి బాబ్జీ’ పాత్రలో చాలా బాగా నవ్వించాడు. అతని కోసం మారుతి రాసుకున్న క్యారెక్టర్ బాగా వర్కవుటైంది. వెన్నెల కిశోర్, బ్రహ్మానందం లు అక్కడక్కడా నవ్వులు పండించారు. పోసాని సినిమా మొత్తం తన పాత్రలో బాగానే నటించాడు.

మైనస్ పాయింట్స్ విషయంలో ముందుగా చెప్పుకోవాల్సింది కథ గురించి. కథ రొటీన్ గా ఉండి అంత గొప్ప ఆసక్తికరంగా ఏమీ లేదు. సినిమా నడుస్తున్న కొద్ది తరువాత ఏం జరుగుతుందో ఊహించేయ్యవచ్చు. దర్శకుడు మారుతి వెంకటేష్, ఆయన స్టార్ డమ్ చుట్టూ కథను అల్లుకుని ఆయన్ను తిరిగి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారంతే.సినిమా రెండవ భాగాం చాలా వరకూ సీరియస్ గానే రన్ అవుతూ ఉంటుందే తప్ప చెప్పుకోదగ్గ కథనం కూడా లేదు. పోసాని తన కామెడీతో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ సినిమా బోర్ కొట్టింది. చాలా వరకూ ముందు ఏం జరుగుతుందో ఊహించెయ్యవచ్చు.

అలాగే మొదటి భాగం తరువాత సినిమాలోని ట్విస్టు కూడా తెలిసిపోతుంది.ఘిబ్రాన్ అందించిన సంగీతం బాగుంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వెంకీ హ్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేసేలా ఉంది. ఆ సంగీతానికి తగ్గట్టు దర్శకుడు మారుతి పాటలను చిత్రీకరించిన తీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. వెంకటేష్ స్టార్ డమ్ ను ఉపయోగించుకుంటూ మామూలు కథను కూడా ఎంటర్టైనింగ్ గా మారుతి చెప్పిన తీరు మెప్పించింది.

వెంకటేష్, పృథ్వీ ల పాత్రలకు రాసిన డైలాగులు బాగున్నాయి.కెమెరా వర్క్ చాలా బాగుంది. దర్శకుడు మారుతి వెంకటేష్ నుండి రెండు వెరియేషన్లలో నటనకు రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి పార్ట్ ను చాలా ఎంటర్టైనింగ్ గా తీసినా సెంకడ్ హాఫ్ మాత్రం సీరియస్ గా ఉంది. సెకండ్ హాఫ్ పెద్దగా కథేమీ లేకపోయినప్పటికీ మంచి కామెడీ డోస్ తో సినిమాని ముగించిన మారుతి పాత వెంకటేష్ ను మళ్ళీ చూపించారు.

మొత్తం మీద బాబు బంగారం చిత్రం వెంకటేష్ ను చాలా రోజుల తరువాత ఓ ఆసక్తికరమైన పాత్రలో చూపించింది. వెంకటేష్ నటనలో చూపిన భిన్నత్వం, మొదటి హాఫ్ లో సాగే కామెడీ సినిమాకి ప్లస్ పాయింట్స్. కానీ సెకండ్ హాఫ్ మాత్రం సీరియస్ గా నడుస్తూ కాస్త బోర్ కొట్టిస్తుంది.ఏది ఏమైనా చివరగా మారుతి కథను బాగానే హ్యండిల్ చేసి సినిమాని ఆసక్తికరంగానే ముగించాడు. అంచనాలని కాస్త కంట్రోల్ లో పెట్టుకుని, రొటీన్ స్టోరీ అన్న విషయాన్ని మర్చిపోతే కుటుంబంతో వెళ్లి ఈ టైమ్ పాస్ ఎంటర్టైనర్ ను చూసి హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు.

*మురళి