ఇది తెలుగు వారందరి విజయం.. తెలుగు వారందరికి గర్వకారణం

0
109

 Posted May 8, 2017 at 16:31

bahubali 2 movie crossed 1000 cr
ఒక ఇండియన్‌ సినిమా వంద కోట్లు దాటడం అంటే 15 సంవత్సరాల క్రితం చాలా గొప్ప. ఇక కొన్ని సంవత్సరాలుగా 100 కోట్లు అనేవి ఇండియన్‌ సినిమాకు చాలా తక్కువ అయ్యింది. సినిమా ఫ్లాప్‌ అయినా కూడా వంద కోట్లు వచ్చేస్తున్నాయి. గత అయిదు సంవత్సరాలుగా ఇండియన్‌ సినిమా 1000 కోట్ల క్లబ్‌పై దృష్టి పెట్టింది. ఇండియన్‌ స్టార్‌ హీరోలు అంతా కూడా వెయ్యి కోట్లు ఎప్పుడెప్పుడు సాధిద్దామా అంటూ ఎదురు చూస్తున్నారు. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ వెయ్యి కోట్లకు దగ్గరకు వెళ్లాడు. కాని ఆ మార్క్‌ను మాత్రం అందుకోవడంలో విఫలం అయ్యాడు.

ఇక సౌత్‌ సినిమాలు ఇప్పటికి కూడా వంద కోట్లు అంటేనే కష్ట పడుతున్నాయి. తెలుగు, తమిళ సినిమాలు వంద కోట్లు సాధించాయి అంటే అవి భారీ విజయంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఒక తెలుగు సినిమా వంద కాదు, రెండు వందలు కాదు, అయిదు వందలు కాదు, బాలీవుడ్‌ స్టార్స్‌కు కూడా సాధ్యం కాని వెయ్యి కోట్లను చాలా సునాయాసంగా రాబట్టింది. కేవలం పది రోజుల్లోనే ‘బాహుబలి 2’ చిత్రం వెయ్యి కోట్లను రాబట్టడంతో తెలుగు జాతి గౌరవం అమాంతం పెరిగి పోయింది. బాలీవుడ్‌ వద్ద తెలుగు సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు దక్కింది. సౌత్‌ సినిమాలను చిన్న చూపు చూసే వారికి ‘బాహుబలి 2’ సినిమా చెంప పెట్టు వంటిది. తెలుగు వారందరికి ఈ విజయాన్ని రాజమౌళి కానుకగా ఇచ్చాడు, అలాగే ప్రతి తెలుగు వాడు కూడా ఈ సినిమాకు గర్వ పడాలి.