ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మీపార్వతి విలన్?

Posted February 7, 2017

balakrishna announced ntr biopic movie laxmi parvathi villain in this movie
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తానని ఆయన తనయుడు బాలయ్య ప్రకటించగానే నిప్పు రగిలింది.సినిమాలో ఏ అంశాలు ఉంటాయి?ఎవరిని తప్పుబట్టే విధంగా ఉంటాయి ? ఈ రెండు విషయాల మీద జనాల్లో చర్చ మొదలైంది.ఎన్టీఆర్ చనిపోయి 20 ఏళ్ళు దాటిపోయినా ఆయన జీవన చరమాంకంలో వ్యక్తిగత, రాజకీయ పరిణామాల మీద భిన్న అభిప్రాయాలు వున్నాయి.టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపై ఏకాభిప్రాయం ఉండదు.మీడియా పరిధి ఇంత విస్తృతంగా లేకపోవడంతో అప్పటి పరిణామాలపై బయటికి వచ్చింది అంతంత మాత్రమే.ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ బయోపిక్ గురించి బాలయ్య ప్రకటన సంచలనం రేపింది.కధా వస్తువు విషయంలో ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలో ఏ విషయాలు వుండాలన్నదానిపై ఓ కమిటీ వేసి అభిప్రాయ సేకరణ ద్వారా ఆ పని పూర్తి చేయాలని బాలయ్య భావిస్తున్నారు.

బాలయ్య ఆలోచనలు ఇలా ఉంటే నాటి వివాదానికి కేంద్రబిందువుగా మారిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి గొంతెత్తారు.ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయాన్ని కూడా సినిమాలో చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.చంద్రబాబుని మంచిపాత్రలో చూపిస్తే ఊరుకోబోమని …న్యాయపోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.ఇక తన పాత్రని ఎలా చూపిస్తారో అన్న అనుమానం లక్ష్మీపార్వతికి ఉండనే వుంది.తనని చెడుగా చూపించవచ్చన్న సందేహంతోనే బాలయ్య ప్రకటన వచ్చిన వెంటనే ఆమె గొంతెత్తారు.బాబుని టార్గెట్ చేస్తూ వాయిస్ రైజ్ చేశారు.

లక్ష్మి పార్వతి సందేహాన్ని నిజం చేస్తూ టీడీపీ ఆమె మీద ఎదురుదాడికి దిగింది.ఎన్టీఆర్ జీవిత చరిత్రని సినిమాగా తీస్తే లక్ష్మిపార్వతే విలన్ అని ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా కుండబద్ధలు కొట్టారు.ఆయన ప్రకటన చూసి టీడీపీ వర్గాల్లోనూ ఓ రకమైన ఆందోళన కనిపిస్తోంది.లక్ష్మీపార్వతిని విలన్ గా చూపిస్తే ,ఆమె చేతిలో పావు అయిపోయినట్టు ఎన్టీఆర్ పాత్రని చిత్రీకరిస్తే,ఆ అవమానం లక్ష్మీపార్వతికి మాత్రమే కాదు ..అఖిలాండ ప్రేక్షకలోకానికి,పేదోడి జీవితంలో రాజకీయం ద్వారా కూడా వెలుగులు నింపొచ్చని నిరూపించిన ఎన్టీఆర్ కి కూడా .

ఎన్టీఆర్ ప్రకటన ముందు బాలయ్య ఈ విషయాల గురించి లోతుగా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ ఒక్కరోజులోనే జరుగుతున్న చర్చ చూస్తే ఎన్టీఆర్ మీద జనానికి ఉన్న అభిమానం,ఆయన జీవితంలో ప్రపంచానికి తెలియని కోణాల్ని తెలుసుకునేందుకు ప్రజల్లో ఉన్న ఆసక్తి అర్ధం అవుతాయి.ఈ విషయాల్ని గుర్తుంచుకుని ఎన్టీఆర్ సినిమాని ఓ యజ్ఞం గా భావించి ముందుకెళ్లాలి ..లేదా ఆ ఆలోచన పక్కనపెట్టాలి.ఆ సినిమా సాధించే జయాపజయాల కన్నా ఎన్టీఆర్ ని ప్రజల ముందు ఎలా నిలబెడతారన్నది అంతకు మించిన అంశం.ఏదేమైనా లక్ష్మీపార్వతి విలన్ అన్నది ఎన్టీఆర్ గౌరవంతో ముడిపెట్టిన విషయమని బాలయ్య మర్చిపోకూడదు.