రగులుతున్న బెంగళూరు…

  bangalore city people fighting tamil nadu people kaveri water issue

కర్ణాటక, తమిళనాడుల మధ్య ఏర్పడిన కావేరి జలాల వివాదం కారణంగా ఇరు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సోమవారం బెంగళూరులో బస్సులు, మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. విద్యా, వాణిజ్య, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఆందోళనకారులు తమిళుల హోటళ్లపై దాడిచేశారు. లారీలు, బస్సులు, ఇతర వాహనాలకు నిప్పుపెట్టారు. బన్నెర్ఘట్ట రోడ్డులోని హోటళ్లపై దాడి చేశారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా పోస్టర్లను తగులబెట్టారు. నగరంలోని నయందనహళ్లి, బెల్, మైసూర్ రోడ్డు, ఆర్ఆర్ నగర్, కెంగేరి, సుద్దుగుంటె పాల్యా, హోసూర్ రోడ్డు, ఎలెక్ట్రానిక్ సిటీ, విజయ్నగర్, శ్రీరాంపురం, ఒక్లిపురం, యశ్వంత్పుర, యలహంక తదితర ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. బెంగళూరులో 144 సెక్షన్ విధించినట్టు కర్ణాటక డీజీపీ ప్రకటించారు. నిరసనకారులను అదుపు చేయడానికి 15 వేలమంది పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించారు. నగరంలో తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను పెంచారు. తమిళులపైనా, వారి ఆస్తులపైనా దాడులు చేయకుండా ప్రశాంతంగా బంద్ పాటించాలని కర్ణాటకలోని పలు సంఘాలు, సంస్థలు విన్నవించినా ఆందోళన హింసాత్మకంగా మారింది.

కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఓ లారీపై దాడిచేశారు. ఆందోళనకారులు తమిళనాడుకు వెళ్లే వాహానాలను అడ్డుకున్నారు. మాండ్యలోనూ హింసాత్మక ఘటనలు జరగడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు తమిళనాడులోనూ కన్నడిగులపై తమిళులు దాడులు చేస్తున్నారు. కన‍్నడిగుల ఆస్తులు, కర్ణాటకకు సంబంధించిన కార్యాలయాలపై దాడిచేశారు. కన్నడిగులకు భద్రత కల్పించండి: తమిళనాడులో కన్నడిగులపై దాడిచేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు. సోమవారం సిద్ధరామయ్య ఆమెకు ఈ మేరకు ఓ లేఖ రాశారు. తమిళనాడులోని కన్నడిగులకు భద్రత కల్పించాల్సిందిగా జయలలితను కోరారు. ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడవద్దని సిద్ధరామయ్య కర్ణాటక ప్రజలకు విన్నవించారు. మంగళవారం ముఖ్యమంత్రి అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని, కావేరి జలవివాదంపై చర్చిస్తామని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర చెప్పారు.