3 లక్షలు దాటితే బాదుడే!!

Posted February 7, 2017

bankings more than 3 lakhs been penality
3 లక్షలకు మించి నెట్ క్యాష్ తీసుకుంటున్నారా? అయితే మీరు మునిగినట్టే! ఎందుకంటే నగదు లావాదేవీలు 3 లక్షలు దాటితే 100 శాతం పెనాల్టీ తప్పదు. తీసుకున్నవాళ్లే ఆ ఫైన్ కట్టాలి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఈ నిబంధన నగదు రహిత లావాదేవీల్లో మేజర్ రోల్ పోషించనుంది.

నల్లకుబేరులు ఇక తప్పించుకోవడానికి వీల్లేకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. బ్లాక్ మనీ ఏ రూట్ లోనూ చలామణి కాకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. నల్లకుబేరులకు చెక్ పెట్టేందుకు మరో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇక నుంచి నగదు లావాదేవీలు 3 లక్షలు దాటితే 100 శాతం పెనాల్టీని విధించబోతున్నారు.

3 లక్షల లోపు లావాదేవీల వరకు ఎలాంటి పరిమితుల్లేవు. కానీ 3 లక్షలు దాటారంటే వాత పడినట్టే. 3 లక్షలకు మించిన నగదు లావాదేవీలు చెల్లవని కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే 3 లక్షలకు మించి క్యాష్ లావాదేవీలు జరిపితే ఇక కష్టమే. అలాంటి లావాదేవీల్లో ఎంత మొత్తం పట్టుబడితే అంత జరిమానాగా చెల్లించాలి. ముక్కుపిండి మరీ 100 శాతం ఫైన్ ను వసూలు చేస్తారు. అందులోనూ ఇచ్చిన వారి కంటే ఎవరైతే 3 లక్షలకు మించిన అమౌంట్ ను తీసుకుంటారో వారిదే నేరం. డబ్బు పుచ్చుకున్నవారే ఈ పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది.

 

ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో కొత్తగా 269 ఎస్.టి నిబంధనను కొత్తగా చేర్చారు. ఈ నిబంధన ప్రకారం ఏ వ్యక్తీ కూడా 3 లక్షలకు మించిన మొత్తాన్ని నగదుగా తీసుకోరాదు. ఒకే వ్యక్తి నుంచి ఒక రోజులో కానీ, ఒకే లావాదేవీలో కానీ, ఒకే సందర్భంలోగానీ ఈ అమౌంట్ ను తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ తీసుకుంటే దొరికినంత నగదు ఫైన్ రూపంలో చెల్లించాలి. ఇందులో ప్రభుత్వం, బ్యాంకులు, పోస్టాఫీసులు, సహకార బ్యాంకులకు మాత్రమే మినహాయించారు. అంటే దీనర్థం 3 లక్షలు దాటితే ఇక ముప్పు తప్పదన్న మాట.

ఉదాహరణకు రూ.4 లక్షల నగదు లావాదేవీలు జరిపితే జరిమానా రూ.4 లక్షలు చెల్లించాలి. రూ.50 లక్షల ట్రాన్సాక్షన్ అయితే, రూ.50 లక్షలు ఫైన్ కట్టాలి. ఉదాహరణకు ఎవరైనా ఒకరు ఖరీదైన వాచీని నగదుపై కొనుగోలు చేస్తే, షాపు నిర్వాహకుడే టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధన భారీ నగదు లావాదేవీల విషయంలో వెనక్కి తగ్గేలా చేస్తుంది.

భవిష్యత్తులోనూ నల్లధన చలామణిని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తున్నది. నగదు ఆధారిత వినియోగానికి ఉన్న అవకాశాలను ఒక్కొక్కటీ మూసివేస్తోంది. రూ.2 లక్షలకు పైబడి నగదు లావాదేవీకి పాన్ నంబర్ ఇవ్వాలన్న పాత నిబంధన కూడా యథాతథంగా కొనసాగనుంది.