దేవుడికి బిచ్చగాడి కిరీటం!!!

Posted December 29, 2016

begger donates silver chrown
ఆ మధ్య వచ్చిన బిచ్చగాడు సినిమా జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వర్షం కురిసింది. కోటీశ్వరుడు అయిన విజయ్ ఆంటోనీ.. తన తల్లి ఆరోగ్యం కోసం బిచ్చగాడుగా మారడాన్ని అద్భుతంగా తెరకెక్కించారు ఆ సినిమాలో. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఇలాంటి బిచ్చగాడి కథ వెలుగులోకి వచ్చింది.

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి… పుట్టుకతోనే నిరుపేద. దీంతో జీవనోపాధి కోసం చిన్నప్పుడే విజయవాడకు వలసవెళ్లాడు. పూట గడవడం కోసం బెజవాడలో ఎన్నో పనులు చేశాడు. నాలుగు మెతుకులైతే దొరికాయి. కానీ అతని జీవితంలో మార్పు రాలేదు. దీంతో అతనికి పెళ్లి చేసుకుందామన్న ఆలోచన రాలేదు. ఈలోపే అతను 50 ఏళ్లు దాటేశాడు. వృద్ధాప్యంతో పనులు చేసే శక్తి లేక… యాచనతో నెట్టుకొచ్చాడు. విజయవాడలోని వీధుల్లో, కోదండరామ ఆలయం వద్ద భిక్షాటన చేయడం ప్రారంభించాడు. వచ్చిన డబ్బులతోనే పొట్ట నింపుకున్నాడు. నా అన్న వారు ఎవరూ లేకపోవడంతో అతనికి పెద్ద ఖర్చు లేదు. దీంతో కొంత డబ్బు సమకూరింది. ఇప్పుడు అతని వయస్సు 75 ఏళ్లు. ఈ వయస్సులో ఇతని స్థానంలో వేరే బిచ్చగాళ్లుంటే.. ఆ డబ్బును దాచి పెట్టుకునే వారు. లేకపోతే కావాల్సింది కొనుక్కునే వాళ్లు. ఇతర అవసరాలకు డబ్బును ఖర్చుపెట్టేవారు. ఈ యాదిరెడ్డి మాత్రం అలా చేయలేదు. దాన్ని ఆధ్యాత్మిక అవసరాలకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఏళ్లుగా ఏ గుడి ముందు అయితే భిక్షం ఎత్తుకున్నాడో ఆ గుడిలోని దేవుడికి వెండి కిరీటాలు చేయించి తన భక్తిని, ప్రత్యేకతను చాటుకున్నాడు యాదిరెడ్డి. కోదండరాముడికి రెండు వెండి కిరీటాలు చేయించాడు. వాటికి 1,50,000 ఖర్చు అయింది. అంతే గాకుండా 20 వేలను నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చాడు. గతంలో సాయినాథుడికి కూడా వెండి కిరీటాన్ని చేయించి దాతృత్వాన్ని చాటుకున్న ఘనత ఇతనిదే. ఏదేమైనా కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా….రూపాయి కూడా దానం చేయని ఘనులు.. ఈ యాదిరెడ్డిని బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.