టీవీ ఛానల్ పెట్టబోతున్న భూమా కుటుంబం?

Posted February 12, 2017

bhuma nagireddy family to launch a new channel
మీడియా రంగంలో పోటీ పెరిగిపోయి ఉన్న టీవీ ఛానెల్స్ అస్తిత్వం కాపాడుకోడానికి నానా ఇబ్బందులు పడుతున్న టైం లో జర్నలిస్టులకి ఓ శుభవార్త.తెలుగులో మరో సరికొత్త న్యూస్ ఛానల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.అయితే ఎవరూ ఊహించని విధంగా భూమా నాగి రెడ్డి కుటుంబం ఈ ఛానల్ పెట్టబోతోందన్నదే విశేషం.ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆర్ధికంగా తాము అంత బలంగా లేమని భూమా ప్రకటించారు.దీంతో ఇప్పుడు ఏకంగా ఛానల్ పెట్టి నడిపించే పరిస్థితి ఉందా అంటే ఎస్ అని వెంటనే చెప్పలేము.అయినా నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు ఈ వార్తల వెనుక ఓ కారణం కూడా కనిపిస్తోంది.భూమా కుటుంబం మీడియా లోకి రావాలనుకోవడం వెనుక నాగిరెడ్డి కూతురు కారణమని తెలుస్తోంది.

భూమా కుమార్తె అంటే ఎమ్మెల్యే గా ఉన్న అఖిలప్రియ కాదు.ఆయన చిన్న కూతురు మౌనిక. నాగిరెడ్డి ఛానల్ ఆలోచన చేయడానికి మౌనిక చదివిన చదువే కారణం.ఆమె ఆస్ట్రేలియా లో మాస్ కమ్యూనికేషన్స్ చేసి వచ్చిందట.రాజకీయాల్లో కాకుండా జర్నలిజం రంగంలో సెటిల్ కావాలని మౌనిక ఆలోచనకి అనుగుణంగా ఛానల్ పెట్టాలని భూమా నాగి రెడ్డి ప్లాన్ చేస్తున్నారట .అయితే ప్రస్తుతం మీడియా పరిస్థితి అంత బాగా లేని విషయం ఆయన దృష్టికి వెళ్లిందట.అందుకే ఛానల్ పెడతారన్న వార్తలు బయటికి వస్తున్నా డిజిటల్ మీడియా రంగాన్ని ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయని కూడా ఓ వాదన వినిపిస్తోంది.రాజకీయ రంగానికి చెందిన కుటుంబం నుంచి జర్నలిజం చదువుకున్న ఓ యువతి అదే ఫీల్డ్ లో కొనసాగాలనుకోవడం విశేషమైతే..అందుకు కుటుంబం అండగా నిలిచి ప్రోత్సహించడం అంతకు మించిన విశేషం.