చేత‌బడుల‌పై స‌మ‌ర‌శంఖం!!

Posted December 25, 2016

black magics are banned
కంప్యూట‌ర్ యుగంలోనూ ఇప్ప‌టికీ గ్రామాల్లో క్షుద్ర‌పూజ‌లు, బాణామ‌తి, చేత‌బడుల‌ను న‌మ్మే వారు ఇంకా ఉన్నారు. ఈ మాయ‌లో ప‌డి ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకుంటున్న వారూ ఉన్నారు. అలాంటి మాయ‌మంత్రాల‌కు చెక్ పెట్టాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇక క్షుద్ర‌పూజ‌ల‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

క్షుద్ర‌పూజ‌ల నియంత్ర‌ణ‌కు జాతీయ‌స్థాయిలో కొత్త చటాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర‌స‌ర్కార్ స‌న్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్ప‌టికే రాష్ట్రాల‌కు లేఖ రాసింది. అంతేకాదు క్షుద్రపూజలు, చేతబడులను అరికట్టడానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న చట్టాల గురించి తెలపాలని ఆ లేఖలో పేర్కొంది. రాష్ట్రాల నుంచి వ‌చ్చే సూచ‌న‌ల ఆధారంగా కేంద్రం నిర్ణ‌యం తీసుకోనుంద‌ని స‌మాచారం.

కేంద్రం తీసుకొచ్చే కొత్త చ‌ట్టంలో మోసం చేశాక కేసులు పెట్టడం కాకుండా.. క్షుద్రపూజలు చేసేవారి సమాచారం తెలియగానే కేసులు పెట్టేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంతేకాదు క‌ఠిన‌శిక్ష ప‌డేలా చ‌ట్టంలో మార్పులు రానున్నాయ‌ట‌. సినిమాలు-టీవీ సీరియళ్లలోనూ బాణామ‌తి దృశ్యాల‌పై క‌ఠిన నిర్ణ‌యం ఉండ‌బోతుంద‌ట‌. ఇలాంటి వాటిని ప్రేరేపించే దృశ్యాలపై నిషేధం విధించేలా కూడా కొత్త చట్టం ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైనా..సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఆ కొత్త‌చ‌ట్టం అమల్లోకి రావాల‌ని విశ్లేష‌కులు కోరుతున్నారు. ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రిగే ఇలాంటి చ‌ట్టం విష‌యంలో కేంద్రం ప‌క్కాగా వ్య‌వ‌రించాల‌ని సూచిస్తున్నారు.