జన్ ధన్ ఖాతాదారుల కష్టాలు..

Posted November 23, 2016

black money put in jan dhan accounts
దేశ ప్రజల్ని బ్యాంకు లావాదేవీలకు అలవాటు చేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున పేదలతో అకౌంట్లు తెరిపించింది.జన్ ధన్ పేరుతో ఏర్పాటైన ఈ ఖాతాల్ని ప్రధాని మోడీ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రోత్సహించారు.అయితే ఆ ఖాతాలు ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా బడాబాబులకు ఉపయోగపడుతున్నాయి.పేదలకి నయానో భయానో చెప్పి వారి ఖాతాల్ని పెద్దోళ్ళు వాడుకుంటున్నారు.ఇటీవలదాకా జన్ ధన్ ఖాతాల్లో పెద్దగా డబ్బుండేది కాదు.మోడీ నిర్ణయం తర్వాత ఆ ఖాతాల్లో 21 వేల కోట్లు జమ అయినట్టు ఓ అంచనా .

దీంతో RBI ,ఆర్ధిక శాఖ అప్రమత్తమయ్యాయి.జన్ ధన్ ఖాతాదారుల లావాదేవీలపై దృష్టి సారించాయి.అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. అయితే జన్ ధన్ ఖాతాదారుల మీద బడా బాబుల ఒత్తిళ్లు సామాన్యంగా లేవు.తూర్పు గోదావరి జిల్లాలో ఓ పెట్రోల్ బంక్ యజమాని తన దగ్గర పని చేసే అతన్ని అకౌంట్ లో 2 .5 లక్షలు వేసి తర్వాత తిరిగి ఇవ్వమని అడిగాడు.ఆలా చేయడం తప్పని …తద్వారా రేషన్ కార్డు,ఆరోగ్య శ్రీ కి ఇబ్బంది వస్తుందని ఆ ఉద్యోగి భయపడి అలా చేయడానికి నిరాకరించాడు.దీంతో ఆ యజమాని అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాడు.ఇలా జన్ ధన్ ఖాతాల వల్ల ప్రయోజనం మాటేమో గానీ పేదలకి ఇబ్బందులు ,ఒత్తిళ్లు అదనపు భారంగా పరిణమించాయి.