తెలంగాణలో తగ్గేది లేదంటున్న చంద్రబాబు

0
84

Posted April 25, 2017 at 17:13

chandrababu challenge to raise in telanganaకొన్నాళ్లుగా తెలంగాణలో సైలంట్ గా ఉన్న టీడీపీ.. ఇప్పుడు కేసీఆర్ ఇలాకాలో రగడ చేసే వరకూ వెళ్లింది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని నోరెత్తనివ్వని కేసీఆర్ కు గుణపాఠం చెప్పడమే టార్గెట్ గా రేవంత్ పనిచేస్తున్నారు. పైగా చింతమడకలో సభపెట్టి గులాబీ బాస్ పని పడతానన్నారు. అయితే ఈ స్టెప్ వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉండొచ్చన్న ఊహాగానాలు అప్పట్లో వినిపించినా.. ఇప్పుడు టీటీడీపీ నేతల భేటీ తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది. తెలంగాణలో తగ్గే ప్రసక్తే లేదని బాబు స్పష్టం చేశారు.

తెలంగాణలో క్యాడర్ ను బలోపేతం చేయాలని, జిల్లాల వారీగా మినీ మహానాడులు నిర్వహించాలని బాబు నేతలకు సూచించారు. ప్రతి మినీ మహానాడులో టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారు. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు కావాలనే తెలంగాణలో దూకుడు తగ్గించారన్న విమర్శలకు చెక్ పెడుతూ.. చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు టీటీడీపీ నేతల్లో కొత్త జోష్ నింపాయి. విజయం కోసం సొంత నిర్ణయాలు తీసుకోవాలని, ఎంతవరకైనా దూకుడుగా వెళ్లొచ్చని చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.

దీంతో ఇప్పటివరకూ అయోమయంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఇక రెచ్చిపోనున్నారు. జిల్లాల వారీగా సభలు పెట్టి.. కేసీఆర్ సర్కారును ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని, లేకపోతే అసలుకే ఎసరు వస్తుందని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో పలచన కావద్దని, ఎట్టి పరిస్థితుల్లో గట్టి పోరాటం చేయాలని ఆయన ఆదేశించారు. ఎక్కడికక్కడ స్థానిక నేతలతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.