బాబు ఆ రెండు రోజుల గండం దాటగలడా?

0
69

Posted April 20, 2017

chandrababu tension because of modi meetings in andhra pradesh
ఓ చక్రవర్తి అశ్వమేధ యాగం తలపెట్టాడు.దేశమంతా ఆ చక్రవర్తి వదిలిన యాగాశ్వానికి తలవంచుతున్నారు. ఆ గుర్రం అలా ముందుకు వస్తోంది.ఆ చక్రవర్తి తో ఓ చిన్నరాజుకి స్నేహం వుంది .ఆ చక్రవర్తి,యాగాశ్వం తమ దేశం లో ఓ రెండు రోజులు గడపడానికి వస్తున్నాడని ఆ చిన్నరాజుకి వర్తమానం అందింది .అది స్నేహపూర్వక యాత్రా లేక దండయాత్రకు వస్తున్నారా ? ఇవ్వాల్సింది ఆతిధ్యమా లేక యుద్ధానికి సిద్ధం కావాలా ? ఇప్పుడు ఆ చిన్న రాజుని వేధిస్తున్న ప్రశ్న.ఇంతకీ ఆ చిన్న రాజు చంద్రబాబు అయితే ,ఆంధ్రప్రదేశ్ కి వస్తున్న చక్రవర్తి మోడీ.

ఢిల్లీకి ఎప్పుడూ కొరుకుడుపడని ఆరవ రాజకీయాన్ని కూడా తమ చేతి పగ్గాల్లోకి అందుకున్న బీజేపీ కి అమాంతం ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది.ఇంటాబయటా ఎదురు లేని ఈ పరిస్థితుల్లో బీజేపీ మిత్రధర్మాన్ని పాటిస్తుందా లేక దండయాత్రకు సిద్ధమవుతోందా అన్న టెన్షన్ సీఎం చంద్రబాబుకి ఉండనే వుంది.ఈ టైం లో జులై 15 ,16 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు విశాఖలో జరపడానికి బీజేపీ నిర్ణయించుకుంది.ఈ సమావేశాలకు ప్రధాని మోడీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తున్నారు.వాళ్ళు ఇక్కడకి వచ్చి మరీ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరణకు ఆదేశాలో,సంకేతాలో ఇస్తే టీడీపీ పరిస్థితి ఏంటి ? ఇప్పటికే బీజేపీ లో ఓ వర్గం టీడీపీ ని హైకమాండ్ నుంచి దూరం చేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది.మోడీ,అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ గ్రూప్ ఇంకా రెచ్చిపోతుంది.ఈ పరిణామాలు వూహించదగినవే కావడంతో బాబు టెన్షన్ పడుతున్నారు.అందుకే ఆ రెండు రోజుల గండం ఎలా గడుస్తుందా అని బాబు ఎదురు చూస్తున్నారు . మోడీ మిత్రధర్మాన్ని పాటించాలని దేవుడిని వేడుకోవడం తప్ప ప్రస్తుతానికి బాబు దగ్గర ఈ గండం దాటేందుకు వేరే మార్గం లేదు.కానీ ఒక్కటి నిజం.రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.నెలల వ్యవధిలో పార్టీ పగ్గాల నుంచి బహిష్కరణ దాకా వచ్చిన శశికళ, తాను పెంచిన మొక్క చెట్టుగా ఎదిగాక ఆ నీడలోకి రాకుండా సొంత మనుషులే అడ్డుకుంటున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వున్న అద్వానీ ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు.కాదంటారా ?