టీ-కాంగ్రెస్ రెడ్డితో టీఆర్ఎస్ రెడ్డి ఢీ

Posted December 15, 2016

chenna reddy and niranjan reddy fight
తెలంగాణలో ఇద్దరు రెడ్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. అందులో ఒకరు వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి. మరొకరు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి. చిన్నారెడ్డి కాంగ్రెస్ అయితే… నిరంజన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి. కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. దానికి ఏకైక కారణం ఒక్కటే ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ పడ్డారు. టీఆర్ఎస్ హవాకు ఎదురొడ్డిన చిన్నారెడ్డి.. నిరంజన్ రెడ్డిని ఓడించారు. అయితే ఈ ఓటమి తర్వాతే పరిస్థితి మారింది. గెలిచిన చిన్నన్న ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. కానీ ఓడిపోయిన నిరంజన్ సారు మాత్రం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడయ్యారు.

ప్రస్తుతం చిన్నారెడ్డితో పోలిస్తే నిరంజన్ రెడ్డికి బలమైన నాయకుడిగా ఎదిగారు. చిన్నారెడ్డికే అనుభవం ఎక్కువగా ఉన్నా..తన వాగ్ధాటితో ఆయన్ను వెనక్కు నెట్టేశారు నిరంజన్ సార్. అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా చిన్నన్నను కార్నర్ చేస్తున్నారాయన. ఇప్పటికే నియోజకవర్గంలో తన పట్టును పెంచుకున్నారాయన. ఒక రకంగా చెప్పాలంటే చిన్నారెడ్డి కంటే నిరంజన్ రెడ్డికే ఇప్పుడు ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేసింది. దీంతో ఇద్దరూ 2019 ఎన్నికలే లక్ష్యంగా వేగం పెంచారు. పోటీపడి ఒకర్నొకరు విమర్శించుకుంటున్నారు. మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు.

తెలంగాణకు అన్యాయం చేసే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును గతంలో చిన్నారెడ్డి సమర్థించారట. ప్రస్తుతం ఇదే అంశం మరోసారి ఇద్దరి మధ్య కొట్లాటకు దారి తీసింది. తాను ఎప్పుడూ సమర్థించలేదని చిన్నన్న అంటుంటే.. కాదు సపోర్ట్ చేశారంటూ నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ విషయాన్ని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్దమేనని చిన్నారెడ్డి సవాల్ విసిరారు. అంతేకాదు పుష్కర ఘాట్ల నిర్మాణంలో నిరంజన్ రెడ్డి నాలుగు కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇలా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు ఇద్దరు రెడ్లు.