చిన్నమ్మల కాలం!!

Posted January 1, 2017
chinamma time
ప్రస్తుత రాజకీయాల్లో అమ్మల కంటే వారి వెనకుండే చిన్నమ్మలదే హవా నడుస్తోంది. అంటే తెర వెనక ఉండి చక్రం తిప్పే మహిళా మణుల మాటే చెల్లుతోందన్న మాట. తమిళనాడు, యూపీ, కర్ణాటకలోని పరిణామాలు చూస్తే ఇదెంత నిజమో అర్థమవుతుంది.

పురుచ్చితలైవి జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అమ్మ పోయాక ఎవరు అనుకుంటున్న తరుణంలోనే చిన్నమ్మ తెరపైకి వచ్చేసింది. అన్నాడీఎంకే చిన్నమ్మ శశికళ చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శి. ఒకరకంగా చెప్పాలంటే సీఎం పన్నీర్ సెల్వం కంటే కూడా చిన్నమ్మకే ఫుల్ సపోర్ట్ ఉంది. ఆ రేంజ్ లో ఆధిపత్యాన్ని చాటుకుంది చిన్నమ్మ. సెల్వం సారు పేరుకే సీఎం అని… మొత్తం కథంతా నడిపిస్తున్నది శశికళేనని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు త్వరలోనే చిన్నమ్మే ముఖ్యమంత్రి అని అన్నాడీఎంకే నాయకులు చెబుతున్నారు.

యూపీలో ఒక్కరోజులో అంతా తలకిందులైపోయింది. ఏకంగా సీఎం అఖిలేశ్ నే ఎస్పీ నుంచి బహిష్కరించి షాకిచ్చారు ములాయం. చివరకు కరెక్ట్ టైంలో సంధి కుదిరింది… కానీ లేకపోతే పార్టీలో చీలిక లాంఛనమే అని ప్రచారం జరిగింది. చివరకు శుభం కార్డు పడ్డా ఇలా జరగడానికి చిన్నమ్మే కారణమని చెబుతున్నారు. ఆ చిన్నమ్మ మరెవరో కాదు ములాయం రెండో భార్య, అఖిలేశ్ యాదవ్ చిన్నమ్మ సాధనా యాదవ్. చిన్నమ్మే పుండు మీద కారం చల్లి..తమాషా చూసిందని అఖిలేశ్ వర్గం చెబుతోంది.

అటు కర్ణాటకలోనూ ఓ చిన్నమ్మ ఉందట. ఆమె మరెవరో కాదు యడ్యూరప్పకు సన్నిహితురాలిగా భావించే శోభ. ఎడ్డీ సారు సీఎంగా ఉన్నప్పుడు చక్రం తిప్పింది శోభమ్మేనట. కమలనాథులు చాలామంది ఆ రోజుల్లో ఈమెతోనే పనులు చేయించుకునేవారట. చివరకు అప్పట్లో ఎడ్డీ పదవి కోల్పోవడానికి కూడా శోభమ్మ అత్యుత్సాహమన్న విమర్శలున్నాయి. ఆ తర్వాత పరిస్థితి మారింది. చివరకు ఎడ్డీ బీజేపీ గూటికి చేరినా.. ప్రస్తుతం కూడా చిన్నమ్మ తెర వెనక మంత్రాంగం చేస్తోందని ప్రచారం జరుగుతోంది.

ఇలా మూడు రాష్ట్రాల్లోనూ చిన్నమ్మల కాలం నడుస్తోంది. ఓ చిన్నమ్మ పార్టీనే నడిపిస్తుండగా.. మరో చిన్నమ్మ తెర వెనకుండి మంత్రాంగం నడుపుతోంది.ఇంకో చిన్నమ్మ సీన్ లోకి రాకుండా మరో పెద్దాయనను శాసిస్తోంది. ఇదండీ చిన్నమ్మల అసలు సంగతి!!