చిన్న‌మ్మ వ‌ర్గంలో అంత‌ర్గ‌త పోరు!!

 Posted February 16, 2017

clashes in chinamma party
శ‌శిక‌ళ‌కు సీఎం పోస్టు చేజార‌డంతో సెంగొట్ట‌య‌న్ కు ఆ అవకాశం వ‌స్తుంద‌ని వార్త‌లొచ్చాయి. కానీ అనూహ్యంగా ప‌ళనిస్వామి రేసులోకి వ‌చ్చేశారు. సెంగొట్ట‌య‌న్ కు షాకిచ్చారు. అయితే ప‌ళనిస్వామి విష‌యంలో అప్పుడే చిన్న‌మ్మ వ‌ర్గంలో లుక‌లుక‌లు ప్రారంభమైన‌ట్టు తెలుస్తోంది.

నిజానికి సెంగొట్ట‌య‌న్ కంటే ప‌ళ‌నిస్వామి చాలా జూనియ‌ర్. ఒక‌వేళ సెంగొట్ట‌య‌న్ కు అవ‌కాశం ఇవ్వొద్ద‌ని అనుకుంటే ప‌ళ‌నిస్వామి కంటే సీనియ‌ర్లు తంగ‌మ‌ణి, వేలుమ‌ణి ఉన్నారు. కానీ ప‌ళ‌నిస్వామికి ఆ అవ‌కాశం ఇవ్వ‌డంతో సీనియ‌ర్లు ముగ్గురు ఒక్క‌రైపోయార‌ని టాక్. ఆ ముగ్గురూ క‌లిసి ప‌ళ‌నికి షాకిచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆదిశ‌గా ఎమ్మెల్యేల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. అవ‌స‌ర‌మైతే సెల్వంతో క‌ల‌వ‌డానికి కూడా సిద్ధంగా ఉన్న‌ట్టు సంకేతాలిస్తున్నార‌ట‌. అందుకోసం సెల్వంతో టచ్ లోకి వ‌చ్చేశార‌ట‌. ఎంత‌లేద‌న్నా 30 మంది ఎమ్మెల్యేల‌ను లాగుతామ‌ని మాట ఇచ్చార‌ట‌. ఈ ప‌రిణామాల‌తో చిన్న‌మ్మ వ‌ర్గం త‌ల‌లు ప‌ట్టుకుంటోంద‌ట‌.

సీనియ‌ర్ల క‌థ ఇలా ఉంటే కొంత‌మంది ఎమ్మెల్యేలు గ్రూపులుగా జ‌ట్టు క‌ట్టార‌ట‌. త‌మ గ్రూపులో ఎవ‌రో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తేనే ఉంటాం..లేక‌పోతే సెల్వం ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతామ‌ని గ‌ట్టిగా చెబుతున్నారట‌. దీంతో గ్రూపుల వారీగా అడ్జస్ట్ మెంట్ చేయ‌డానికి శశిక‌ళ వ‌ర్గం ఇబ్బందులు ప‌డుతోంద‌ట‌. అటేమో గ‌వ‌ర్న‌ర్ అవ‌కాశం ఇస్తార‌ని ప‌ళ‌ని ఆశ‌గా ఎదురుచూస్తుంటే.. ఈ అంత‌ర్గ‌త పోరుతో ఆయ‌నలో క‌ల‌వ‌రం మొదలైంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి రాజ‌కీయమంటే ఆషామాషీగా ఉండ‌దు క‌దా!!!