చిన్నమ్మపై కాంగ్రెస్ కు నో క్లారిటీ!!

Posted February 10, 2017

congress have no clarity about chinamma
అటు పన్నీర్ సెల్వం కానీ.. ఇటు శశికళ కానీ బలనిరూపణకు సిద్ధమైతే కాంగ్రెస్ అడుగులు ఎటు వైపన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ పార్టీ మాత్రం ఇంకా డైలమాలోనే ఉంది. అసలు మద్దతు ఎవరికివ్వాలన్న దానిపై తేల్చుకోలేకపోతోంది.

తమిళనాడులో ప్రస్తుతం డీఎంకేతో కలిసి నడుస్తోంది కాంగ్రెస్. హస్తం పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా కీలకంగా మారిన ప్రస్తుతం తరుణంలో కాంగ్రెస్ కు 8 మంది ఉండడం చాలా పెద్ద విషయమే. దీంతో హస్తం ఎమ్మెల్యేలకు గాలమేసేందుకు అటు సెల్వం, ఇటు శశికళ వర్గాలు గాలమేస్తున్నాయి. దీనిపై హైకమాండ్ నుంచి క్లారిటీ లేకపోవడంతో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తేల్చుకోలేకపోతున్నారు.

శశికళ నాయకత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత చిదంబరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ తిరునావుక్కరసర్ మాత్రం చిన్నమ్మకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆదిశగా ఇప్పటికే ఆమె కూడా ఈయనతో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. అవసరమైనప్పుడు మద్దతిస్తామని చిన్నమ్మకు ఆయన అభయమిచ్చారట.

అదే సమయంలో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న డీఎంకే మాత్రం… హస్తం మద్దతు కూడా సెల్వంకే ఉంటుందని ఆశిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా డీఎంకే అభిప్రాయానికే మద్దతిస్తే బావుంటుందన్న ఆలోచనలో ఉన్నారట. అయితే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఆలోచన మరోలా ఉండడంతో వారంతా తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఎవరికి మద్దతివ్వాలో హైకమాండే స్పష్టంగా చెప్పాలని వారు కోరుతున్నారు. అయితే హైకమాండ్ మాత్రం బాల్ ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలకే వదిలేసిందని తెలుస్తోంది. అలా అయితే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మాటకు ఎమ్మెల్యేలు విలువిస్తారా?.. లేక ఆయనకు షాకిచ్చి సెల్వం సారుకు మద్దతిస్తారా? అన్నది చూడాలి.