నితీష్ కి కాంగ్రెస్ అండ..లాలూ గుదిబండ

congress supports nitish
బీహార్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ బద్ద శత్రువులు మిత్రులై ఏర్పాటు చేసిన సర్కార్ కి సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి నితీష్ పై లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇటీవల జైలు నుంచి బయటకొచ్చిన ఆర్జేడీ నేత,మాజీ ఎంపీ షహాబుద్దీన్ … సీఎం నితీష్ కి వ్యతిరేకంగా మాట్లాడారు.ఇంతలో లాలూకి అతిసన్నిహితుడైన రఘువంశప్రసాద్ సింగ్ ఆ మాటలతో జత కలిపాడు. సంకీర్ణ ప్రభుత్వంలో ఎక్కువ స్థానాలు లాలూ పార్టీకి వున్నా … ముఖ్యమంత్రి పీఠం దక్కకపోవడం అయన అభిమానుల్ని నిరాశకి గురిచేస్తోంది. ఈ సందర్భంలో వారి మాటలు పదేపదే సంకీర్ణ సర్కార్ కి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలపై లాలూ మౌనం ఇటు నితీష్ ని అటు మరో సంకీర్ణభాగస్వామి కాంగ్రెస్ కి మంటెక్కిస్తోంది.

ముఖ్యమంత్రి నితీష్ తాజా పరిణామాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఇదే పరిస్థితి కొనసాగితే సంకీర్ణ సర్కార్ నడపలేనని సన్నిహితుల దగ్గర అంటున్నారట. నితీష్ కి సీఎం పగ్గాలు కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దగ్గరికి విషయం చేరిందట. అయన సూచనల ప్రకారం బీహార్ కాంగ్రెస్ నేతలు నితీష్ కి అండగా నిలబడి … లాలూ అనుచరుల్ని కంట్రోల్ చేసే పనిలోపడ్డారు.పీసీసీ అధ్యక్షుడు, బీహార్ విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి మరో అడుగు ముందుకేసి ఇష్టం లేకుంటే సర్కార్ నుంచి బయటకి వెళ్లిపోవచ్చని ఆర్జేడీ నేతలకి హెచ్చరిక చేశారు. దీంతో సీన్ లోకి ఎంటర్ అయిన లాలూ అబ్బే అదేమీలేదని చెప్పారు. కానీ లాలూ వ్యవహారశైలి చూస్తుంటే ఏదో జరుగుతుందని నితీష్ అనుమానిస్తున్నారు. అటు బీజేపీ సైతం పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ భవిష్యత్ వ్యూహాల్ని రెడీ చేసుకుంటోంది.