నోట్ల రద్దు ఎవరికి ఇన్సల్ట్ ..?

Posted November 30, 2016

Image result for amartya sen

నోట్ల రద్దుపై మోడీ సర్కార్‌ తీరును ప్రముఖ ఆర్థిక వేత్త, భారత రత్న, నోబెల్‌ అవార్డు గ్రహీత అమర్త్య సేన్‌ తప్పుపట్టారు. నోట్ల రద్దు నిర్ణయం, దాని అమలు తీరుతెన్నులు రెండూ ప్రభుత్వ ఆధిపత్య ధోరణికి, ఏకపక్ష నిర్ణయాలకు అద్దం పడుతున్నాయన్నారు. బ్లాక్‌ మనీ నియంత్రణ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ప్రజలు కోట్లాది మంది ప్రజలనూ అనుమానిస్తున్నట్టే అన్నారు. రూ 500, రూ 1000 నోట్ల రద్దుపై ప్రభుత్వం అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంతో ప్రజలందరినీ నల్లధనం ఉన్నవారిగా పరిగణించినట్టేనని, తమ వద్ద నల్లధనం లేదని వారు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అమర్త్య సేన్‌ అన్నారు.

బ్యాంకుల్లో సామాన్య ప్రజలు పొదుపు చేసుకున్న కష్టార్జితాన్ని వారు తిరిగి పొందేందుకు సమస్యలు ఎదుర్కొంటున్న క్రమంలో అధికార ధోరణి కలిగిన ప్రభుత్వాలే సొంత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాయని తీవ్రంగా ఆక్షేపించారు. నోట్ల రద్దుతో దేశానికి మేలు జరుగుతుందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలతో సేన్‌ విభేదించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి రప్పిస్తామని గతంలో వారు చేసిన హామీల అమలు ఎలా ఉందో ఇదీ అంతేనన్నారు. ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న కోట్లాది సామాన్యులు, చిన్న వ్యాపారులు ప్రభుత్వ నిర్ణయంతో చితికిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో సమస్యలు మున్ముందు దేశానికి, ప్రజలకు మేలు చేస్తాయని, మంచి నిర్ణయాలు మొదట కఠినంగానే ఉంటాయన్న ప్రభుత్వ వాదనను కొట్టిపారేశారు