ప‌న్నీర్ ను నిండా ముంచేసిన ఢిల్లీ పెద్ద‌లు!!!

Posted February 17, 2017

delhi leaders left panneer selvam away
జ‌య‌ల‌లిత‌కు న‌మ్మిన బంటుగా ఉన్న ప‌న్నీర్ సెల్వం… శ‌శిక‌ళ ద‌గ్గ‌ర మాత్రం ఆ పేరును తెచ్చుకోలేక‌పోయారు. దానికి కార‌ణం ముమ్మాటికీ హ‌స్తిన‌ పెద్ద‌లేనన్న వాద‌న ఉంది. ఢిల్లీ అగ్ర‌నాయ‌కులే ఆయ‌న‌కు లేనిపోని ఆశ‌లు చూపించి… తీరా అస‌లు స‌మ‌యానికి న‌ట్టేట ముంచార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత అటు పార్టీపైనా … ఇటు సెల్వం ప్ర‌భుత్వంపైనా చిన్న‌మ్మ ప‌ట్టు పెరిగింది. రోజురోజుకు అది బ‌ల‌ప‌డిందే త‌ప్ప త‌గ్గ‌లేదు. ఆ విష‌యం సెల్వంకు కూడా తెలుసు. దీంతో ఆయ‌న కూడా శ‌శిక‌ళ చెప్పిన‌ట్టే న‌డుచుకున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌మ‌ని చెబితే స‌రేనంటూ త‌ల ఊపి రాజీనామా చేశారు. తీరా రాజీనామాకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం ల‌భించిన త‌ర్వాత‌… ఢిల్లీ నుంచి ఆయ‌న‌కు వ‌ర్త‌మానం అందింద‌ట‌. చిన్న‌మ్మ‌పై తిరుగుబాటు చేయాల‌ని… అంతా మేం చూసుకుంటామ‌ని కబురు పంపార‌ని టాక్.

కేంద్రంలో మోడీ హ‌వా న‌డుస్తున్న త‌రుణంలో… ఢిల్లీ నుంచి వ‌ర్త‌మానం అంద‌డంతో ప‌న్నీర్ సెల్వం ఎగిరి గంతేశారు. హ‌స్తిన పెద్ద‌ల అండ‌తో ముఖ్య‌మంత్రి కావ‌డం చిటికెలో ప‌ని అనుకున్నారు. అందుకే ఆయ‌న ఎమ్మెల్యేల విష‌యాన్ని సీరియ‌స్ గా ప‌ట్టించుకోలేదు. ఢిల్లీ పెద్ద‌ల ద‌గ్గ‌ర ఏదో మంత్ర‌దండం ఉంది… ఆ దెబ్బ‌కు ఎమ్మెల్యేలు దిగొస్తార‌ని ఆయ‌న కొండంత ఆశ పెట్టుకున్నారు. అటు డీఎంకే క‌లిసిరాక‌పోయినా… అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు త‌న వెంట వ‌చ్చేలా ఢిల్లీయే చూసుకుంటుంద‌ని గుండెపై చేయి వేసుకొని హాయిగా నిదుర‌పోయారు. ప‌ట్టుమ‌ని 10 మంది ఎమ్మెల్యేలు కూడా త‌న వెంట లేకపోయినా అద్భుతం జ‌రుగుతుంద‌ని ఆశించారు. కానీ చిన్న‌మ్మ త‌న‌కంటే రెండాకులు ఎక్కువ చ‌దివింద‌ని అంచనా వేయ‌లేక‌పోయారు.

చిన్న‌మ్మ జైలుకెళ్లిన త‌ర్వాత ఢిల్లీ దెబ్బ‌కు ఆ వ‌ర్గ‌మంతా ఖాళీ అయిపోతుంద‌ని సెల్వం హ్యాపీగా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు జంప్ కావ‌డం లాంఛ‌న‌మే అనుకున్నారాయ‌న‌. కానీ ఆయ‌న అనుకున్న‌ట్టు ఏమీ జ‌ర‌గ‌లేదు. ఢిల్లీ కూడా క‌రెక్ట్ టైంలో ప్రేక్ష‌క‌పాత్ర‌కే పరిమిత‌మైంది త‌ప్ప‌… అటు వైపు నుంచి ఎమ్మెల్యేల‌పై ఎలాంటి ఒత్తిడి రాలేద‌ని టాక్. ఈ విష‌యంలో ఎమ్మెల్యేలు కూడా హ‌స్తిన పెద్ద‌ల నుంచి ఏమైనా లీకులు వ‌స్తాయ‌ని ఊహించార‌ట‌. కానీ అలా ఏం జ‌ర‌గ‌లేదు. రాజ‌కీయ చ‌ద‌రంగంలో తాను పావుగా మిగిలిపోయాన‌ని సెల్వంకు అప్పుడు అర్థ‌మైంది. ఢిల్లీ పెద్ద‌లు కేవలం ఆయ‌న‌ను పావుగా మాత్ర‌మే వాడుకున్నారు. సెల్వంను అడ్డు పెట్టుకొని ఓ రాయి వేశారు. ఆరాయి త‌గ‌ల‌క‌పోవ‌డంతో సైలెంట్ అయిపోయారు. చివ‌ర‌కు సెల్వం మాత్రం ఢిల్లీని న‌మ్ముకొని… మాజీ ముఖ్య‌మంత్రిగానే మిగిలిపోవాల్సి వ‌చ్చింది!!!!