నడిచేది తంబీలు.. నడిపించేది ఢిల్లీ

0
58

Posted April 19, 2017

delhi orders tamil leaders followజయ మరణాన్ని ఆసరాగా చేసుకుని.. తమిళనాడులో బీజేపీ రసవత్తర రాజకీయం నడిపింది. ఎవరూ ఊహించని విధంగా పన్నీర్ ను దగ్గరుండి సీఎంను చేసిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. ఆ తర్వాత మాత్రం అన్నాడీఎంకే అంతర్గత రాజకీయాలతో తమకు సంబంధం లేదని చెబుతూ వచ్చారు. కానీ ఓ సీఎం అంత్యక్రియలకు వచ్చిన కేంద్రమంత్రులు వచ్చామా.. వెళ్లామా అన్నట్లు ఉండకుండా వారం రోజులు తిష్ట వేయడమే అన్ని అనుమానాలకు తావిచ్చింది. ఇక తర్వాత సెల్వం తిరుగుబాటు, ఆయనకు బీజేపీ ఇచ్చిన మద్దతు అన్నీ బహిరంగ రహస్యమే.

ఇప్పుడు కూడా ఢిల్లీలో పళనిస్వామి వర్గం నేత, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, సెల్వం వర్గం నేత మైత్రేయన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో విడివిడిగా భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి పనిచేయాలనేదే కేంద్రం అభిమతమని, మీరు కలిసుంటే మేము కూడా కలిసొస్తామని షా గీతోపదేశం చేశారు. దీంతో అమిత్ షా అభిప్రాయాన్ని తంబిదురై చెన్నైకి చేరవేశారు. వెంటనే తమిళ క్యాబినెట్ సమావేశమై చిన్నమ్మ ఫ్యామిలీని వెలేసింది. ఇక్కడ మరోసారి మోడీ నమ్మిన వ్యక్తిగా పన్నీర్ సెల్వం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

కేంద్రమంత్రి వర్గ విస్తరణలో ఓ క్యాబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు ఇస్తామని, అందరూ కలిస్తేనే రెండాకుల గుర్తు వచ్చేలా చూస్తామని షా షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో చచ్చినట్లు పళనిస్వామి వర్గం పన్నీర్ షరతులకు ఓకే చెప్పింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని, 2019 ఎన్నికల్లో చెరి సగం ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి ఒప్పుకోవాలని అమిత్ షా చాణక్యం ప్రదర్శించారు. దీంతో ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో ఉన్న అన్నాడీఎంకే తంబీలు అన్నింటికీ తలూపారు.