నయీంతో నాకేం పని.? దినేష్ రెడ్డి

 dhinesh reddy said  what work nayeem
గ్యాంగ్ స్టర్ నయీంను అంతమొందించడం మంచిదేనని, నయీం కేసులో నిందితులను శిక్షించాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీజేపీ నేత వి.దినేశ్ రెడ్డి  డిమాండ్ చేశారు. నయీం కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, అమాయకులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన కోరారు. తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ తో ఏ ఒక్క డీజీపీకి సంబంధాలు లేవని దినేశ్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనతో పాటే డీజీపీగా పనిచేసిన ఏ ఒక్క పోలీసు అధికారికి కూడా నయీమ్ తో సంబంధాలు ఉండే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. నయీంను అంతమొందించడం మంచిదేనని, నయీం కేసులో నిందితులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సలాం చేస్తున్నానని అన్నారు.
సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరానని, ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన ముఖ్యమైన  సమాచారాన్ని ఆయనకు అందిస్తానని చెప్పారు. నయీం ఎన్ కౌంటర్ విషయంలో  మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక  టీవీ ఛానెల్ ప్రసారం చేస్తున్నట్లు నయీమ్ కు మాజీ డీజీపీతో సంబంధాలున్నట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు.  
సాధారణంగా లొంగిపోయిన నక్సలైట్లను ఇన్ఫార్మర్లుగా వాడుకుంటారని, అందులో తప్పులేదని తెలిపారు. కానీ దాన్ని సొంత లావాదేవీల కోసం, ఆస్తులు సంపాదించుకోడానికి దుర్వినియోగం చేయడం సరికాదని చెప్పారు. అమాయకులకు అన్యాయం జరగొద్దన్న ఆయన… నయీమ్ ను హతం చేసిన తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలిపారు. ఈ కేసులో రాజకీయ నాయకులు, పోలీసులు, ఇంకా ఎవరున్నా కూడా వారిని తప్పనిసరిగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో, ఈ కేసుతో సంబంధం లేనివారిని ఇరికిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు.