పవన్ కి వల….రాజుగారు భళా

 Posted November 1, 2016

digvijay singh appreciated to pawan kalyan
డిగ్గీ రాజావారు ఏపీ లో అడుగు పెట్టేశారు..రాజకీయం మార్చేసి కాంగ్రెస్ కి పూర్వవైభవం కల్పించడానికి అస్త్రశస్త్రాలతో రెడీ అయిపోయారు.2014 లో ఏ అస్త్రమైతే కాంగ్రెస్ ని కాలరాచిందో …అదే పవన్ కళ్యాణ్ కి వలేశారు డిగ్గీరాజా. పవన్ సాయంతో చంద్రబాబు అధికారాన్ని అనుభవిస్తున్నారని అయన బాధపడిపోయారు.కష్టం పవన్ ది,పవర్ చంద్రబాబుదేలా ?అంటూ పవన్ మీద ఎక్కడలేని ప్రేమ ఒలకబోశారు.అంతటితో ఆగలేదు రాజకీయంగా కాపులకి మరిన్ని అవకాశాలు రావాలని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు.కాపు రిజర్వేషన్ కి కాంగ్రెస్ కట్టుబడి ఉందని కూడా చెప్పుకొచ్చారు.ఇంకో అడుగు ముందుకేసి మామని వెన్నుపోటు పొడిచిన బాబుని ఆంధ్ర ప్రజలు ఎలా నమ్మారో అర్ధం కావడం లేదని తలబద్దలు కొట్టుకున్నారు.

డిగ్గీ రాజా వారు చెప్పినవన్నీ నిజమే అనుకుందాం..కానీ ప్రశ్నలన్నీ మీరే అడిగేసి …ఆరోపణలన్నీ మీరే చేసేస్తే సరిపోతుందా?మీరు కూడా జవాబు చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి కదా?

* కాపు రిజర్వేషన్స్ కి కాంగ్రెస్ కట్టుబడి ఉంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అప్పుడెందుకు ఆ విషయాన్ని గాలికొదిలేసింది?

*పాపం మీరు ఇప్పుడు జాలిపడుతున్నారే అదే పవన్ కళ్యాణ్ అప్పుడు ఎంత మొత్తుకున్నా మీకెందుకు వినపడలేదు రాజా వారు?

*మీరు చెప్పినట్టు బాబుని నమ్మడం మంచిది కాడేమో…మిమ్మల్ని మాత్రం ఎందుకు ఎలా నమ్మాలి?

ఈ మూడు ప్రశ్నలు కాదు మరో మూడొందల వున్నాయి.అందాకా ఎందుకు? పై ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి సరైన సమాధానం మీరివ్వగలిగితే చాలు ..ఆంధ్రాలో పార్టీని బతికించాలన్న మీ ఆశ చూస్తుంటే మాత్రం ముచ్చటేస్తోంది.శవానికి ముస్తాబు చేయొచ్చు ..భారీగా అంతిమ యాత్ర చేయొచ్చు అంతేగానీ ప్రాణాలు తిరిగిపోయగలమా? ఈ విషయం మీకెప్పుడు అర్ధమవుతుందో?