804 పత్రికలపై కేంద్రం వేటు….!

0
96

Posted April 26, 2017 at 17:10

Directorate of Advertising and Visual Publicity suspand to 804 news papers దేశవ్యాప్తంగా రెగ్యులారిటీ పరిశీలన తెలుగురాష్ట్రాల్లోని ప్రచురణకర్తలకూ షాక్ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ తొలిసారిగా రెగ్యులారిటీ కారణాన్ని సాకుగా చూపించి దేశవ్యాప్తంగా 804 పత్రికలపై వేటు వేసింది. డీఏవీపీ వద్ద ఎంపానెల్‌మెంట్ అయిన వాటికి మాత్రమే వర్తించే ఈ వేటుకు సంబంధించిన ఉత్తర్వులను ఈనెల 6న డీఏవీపీ అడిషినల్ డైరెక్టర్ జనరల్ పేరిట జారీచేసింది. 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి వరకూ రెగ్యులారిటీ నిమిత్తం నెలవారీ ఇష్యూలను సమర్పించని పత్రికల జాబితాను కూడా డీఏవీపీ విడుదల చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి 52 పత్రికలు ఉండగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి 15 ఉన్నాయి.

‘ప్రింట్ మీడియా అడ్వర్వైజ్‌మెంట్ పాలసీ – 2016’లోని 13వ క్లాజు ప్రకారం డీఏవీపీ వద్ద ఎంపానెల్‌ అయిన పత్రికలు/జర్నల్స్ తమ పత్రిక నిబంధనల ప్రకారం రెగ్యులర్‌గా ప్రచురితమవుతోందని సంబంధిత అధికారుల వద్ద ధ్రువీకరించుకోవాల్సి ఉంది. ఆ విధంగా రెగ్యులర్‌గా వస్తున్న పత్రికలను ప్రతినెలా 15వ తేదీలోగా డీఏవీపీకి పంపించాల్సి ఉంటుంది.

ఆ విధంగా ఇష్యూలను సమర్పించని పత్రికపై ‘ప్రింట్ మీడియా అడ్వర్వైజ్‌మెంట్ పాలసీ – 2016’లోని 25(బీ) క్లాజు ప్రకారం చర్య తీసుకునే అధికారం డీఏవీపీకి ఉంది. ఆ ప్రకారమే తాజాగా 804 పత్రికలను ఎంపానెల్‌మెంట్ జాబితా నుంచి సస్పెండ్ చేస్తూ డీఏవీపీ నిర్ణయం తీసుకుంది.