ఏరియల్ యోగా తో రోగాలన్నీ మాయం

Posted December 23, 2016

do ariel yoga to be healthyకొత్త యోగా పేరు ఏరియల్‌ యోగా. యోగా ను విదేశాల్లో ఫాలో అవుతున్న వాళ్ళు బోలెడు మంది భారతీయ యోగానికి మహర్దశ పట్టడం అంటే ఇదే ఏ దేశం చూసినా యోగాతో తరించడమే అందుకు నిదర్శనం. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, జీవనశైలిని బట్టి యోగాలో చిన్న చిన్న మార్పులు వచ్చాయి కాని.. వాటన్నిటికీ మూలం మాత్రం మన యోగానే కావడం విశేషం.

అన్నిటికంటే ప్రసిద్ధి అయ్యంగార్‌యోగా. ఆ తరువాత పశ్చిమదేశాల్లో హతయోగా, విన్యాస, కుండలిని, అష్టాంగ, అనుసర, జీవముక్తి, రెస్టొరేటివ్‌ వంటి పేర్లతో యోగాలు ప్రాచుర్యం పొందాయిప్పుడు. ఆ ట్రెండ్‌లో భాగంగానే విదేశాల్లో – ఓ కొత్త యోగాపద్ధతి పుట్టుకొచ్చింది. అదే ఏరియల్‌ యోగా. కొత్తతరం ఆ యోగా పట్ల అమితమైన ఆసక్తి చూపిస్తుండటంతో.. ప్రత్యేక శిక్షణకారులు, యోగాకేంద్రాలు వెలుస్తున్నాయి. మన దేశంలోను ఆ రకం యోగాకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఏరియల్‌ యోగా – వినడానికే చిత్రం గా వండి కదా, ఈ యోగాను చేస్తున్న వాళ్లను చూస్తే అంతే చిత్రంగా అనిపిస్తుంది. పల్లెల్లో ఒకప్పుడు చీరలతో పిల్లలకు పొడవాటి ఊయలలను చెట్లకు కట్టినట్లు.. కట్టుకుని ఈ యోగా చేయడం ఇందులోని విశేషం. ఈ యోగాను యాంటీ గ్రావిటీ యోగా, హమాక్‌ యోగా అని పిలుస్తున్నారు. హమాక్‌ అనేది ఒక మెత్తటి, సున్నితమైన పొడవాటి బట్ట. దాని రెండు అంచులను ఇంటిపైకప్పు సీలింగ్‌కు కడితే – ఒక రకంగా పిల్లలు ఊగే ఊయల మాదిరి తయారువుతుంది.

కింద భూమికి కొన్ని అడుగుల ఎత్తులో ఉండేలా దీన్ని కట్టుకోవాలి. ఆ ఊయల రూపంలో ఉన్న బట్ట మీద రకరకాల భంగిమల్లో యోగా చేయడం దీని పద్ధతి. సాధారణ యోగాభంగిమలు, డ్యాన్స్‌, ఆక్రోబటిక్స్‌ వంటివన్నీ మేళవించి సరికొత్త ఆసనాలను తయారుచేశారు. ఏరియల్‌ యోగాను ప్రముఖ జిమ్మాస్ట్‌, బ్రాడ్‌వే కొరియోగ్రాఫర్‌ అయిన క్రిస్టఫర్‌ హారిసన్‌ అనే పాశ్చాత్యుడు డిజైన్‌ చేశాడట.

సాధారణ యోగాలో కొన్ని మినహాయిస్తే ప్రధాన భంగిమలన్ని ఇందులో ఉంటాయి. అయితే ఏ భంగిమను నేలమీద కూర్చునో, పడుకునో చేయరు. ప్రతిదీ ఆకాశానికి, భూమికి మధ్యలోనే చేయాలి. ఈ ఊయల ఫ్యాబ్రిక్‌ ఎంత బరువైన వ్యక్తులనైనా మోస్తుంది. కనీసం నాలుగు వందల కిలోల వరకు ఇబ్బంది లేదు. ‘‘ప్రాచీన భారతీయ యోగా పునాదుల మీదే.. ఏరియల్‌ యోగాను డిజైన్‌ చేశాము. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. శరీరానికి సంబంధించిన రక్తనాళాలు, కండరాలకే కాదు.. మెదడుకు సంబంధించిన అన్ని రకాల నాడీవ్యవస్థలను చురుగ్గా ఉంచే భంగిమలు ఉన్నాయి.

శరీరంలోని ప్రతి అవయవం మీద సె్ట్రస్‌ పడుతుంది. వ్యాయామానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వార ఎక్కడలేని సాంత్వన సమకూరుతుంది. మెదడులోని జ్ఞాననేత్రమూ చురుకవుతుంది. బ్రెయిన్‌ బేస్డ్‌ స్కిల్స్‌ పెరుగుతాయి’’ అట విదేశీ యోగా నిపుణులు. శారీరక, మానసిక సామర్థ్యాలను మరింత దృఢతరం చేస్తుందీ యోగా అన్నది వారి అభిప్రాయం. శరీరంలోని కండరాలు పటుత్వం కలిగి ఉంటాయి. శోషరసగ్రంథులు (లింఫటిక్‌) చురుగ్గా మారి.. ఉచ్చ్వాశనిశ్చ్వాసలలో స్వేచ్ఛ లభిస్తుంది. జీర్థశక్తి సజావుగా సాగుతుంది. రక్తనాళాలు ఉపశమనం పొంది.. రక్తసరఫరా సాఫీగా సాగుతుంది.

ఒక రకంగా ఏరియల్‌ యోగా చేశాక రీఫ్రెష్‌ అయ్యామన్న అనుభూతి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ యోగాను క్రమంతప్పకుండా చేస్తే.. ఫీల్‌గుడ్‌ హార్మోన్లు చక్కగా వృద్ధి అవుతాయి. ‘‘మనిషి ఆహ్లాదంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. మనలోని హార్మోన్ల తీరుతెన్నుల మీదే మన భావోద్వేగాలు ఉంటాయి. అవే మనల్ని నడిపిస్తాయి. ఎప్పుడైతే చక్కటి వ్యాయామం లేదా యోగా చేస్తామో అప్పుడే హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. అందులో మరీ ముఖ్యంగా ఫీల్‌గుడ్‌ హార్మోన్లయిన సెరొటోనిన్‌, ఎండార్ఫిన్ల ప్రాముఖ్యం ఎనలేనిది. అవి ఉత్పత్తి అయితేనే మనం సంతోషంగా ఉండగలుగుతాము..’’

అయితే ఏరియల్‌యోగాతో అన్నేసి లాభాలున్నాయని – అత్యుత్సాహంతో సొంతంగా చేయకూడదు. ఈ యోగా శిక్షకులైన నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి. ఎందుకంటే ఇది నేలమీద కూర్చుని చేసే సాధారణ యోగావంటిది కాదు. గాల్లో తేలుతూ ఎక్కువసార్లు తలకిందులుగా కూడా చేయాల్సిన యోగా. అందుకని ఎవరికివారు చేయకూడదు. సర్టిఫైడ్‌ యోగా ఇన్‌స్ట్రక్టర్‌ ఆధ్వర్యంలోనే చేయాలి. లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా గాయాలపాలయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ యోగాను గర్భవతులు, వర్టిగో, ఆర్థరైటిస్‌, గ్లుకోమా, అధిక రక్తపోటు ఉన్న వాళ్లు చేయకూడదు.