కంపుకంపుగా ట్రంప్ పాలన..!!

Posted January 28, 2017

donald trump sign on immigration order and border security

అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టి వారం రోజులు గడిచింది. ఎన్నికల ప్రచారం మొదలు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సమయంలో వరకూ  పలు సంచలన వ్యాఖ్యలను చేసిన  ట్రంప్… బాధ్యతలు చేపట్టిన  తర్వాత కూడా అదే శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం  వారం రోజుల పాలనలోనే  ఆయన తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తేనే… ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వారం రోజుల తరువాత తొలిసారి పెంటగన్ కు వెళ్ళిన ట్రంప్… అమెరికాలోకి ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులను తగ్గించేందుకు, ఇస్లామిక్ ఉగ్రవాదులు అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన సంతకం చేశారు. అలాగే అమెరికా, మెక్సికోల మధ్య 1600 కిలోమీటర్ల పొడవున సరిహద్దు గోడ నిర్మించేందుకు ట్రంప్ ఆదేశాలను జారీ చేశారు.

అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేయడాన్ని మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన చర్యగా వారు నిరసిస్తున్నారు. అయితే ఈ నిరసనలను ఏమాత్రం లెక్కచేయని ట్రంప్… తనకో తిక్కుందని…  ఆ తిక్కకు ఓ లెక్కుందన్న చందంగా, ఆందోళనలు చేస్తే… కఠిన కారాగార శిక్షలు తప్పవని హెచ్చరికలు చేశారు.

కాగా  ట్రంప్ జారీ చేసిన ఆదేశాలపై   ఫేస్ బుక్ సీఈవో  జూకర్ బర్గ్   విరుచుకుపడ్డారు. ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులను తగ్గించేందుకు, ఇస్లామిక్‌ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆపేందుకు  ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలను జుకర్  బర్గ్  తప్పుబట్టారు.   టెర్రరిస్టుల నుంచి  అమెరికా రక్షణ  ముఖ్యమే అయినప్పటికీ ఆపదలో ఉన్నవారికీ, శరణార్థులకు సహాయం చేసేందుకు విశాల ధృక్పదంతో వ్యవహరించాలని కోరారు.

అలాగే ట్రంప్ ఆదేశాలపై పాకిస్థానీ విద్యార్థి కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్‌ స్పందించారు. యుద్ధం, హింసల నుంచి తప్పించుకునేందుకు భార్యాబిడ్డలతో తలదాచుకోడానికి వస్తున్నవారికి తలుపులు మూసేస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం బాధాకరమన్నారు. అశాంతి, అనిశ్చితత్వం రాజ్యమేలుతున్న ప్రస్తుత ప్రపంచంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలు, కుటుంబాల పట్ల అమెరికా అధ్యక్షుడు ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని, ట్రంప్ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆమె కోరారు.

ఇదిలా ఉండగా… ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే… అమెరికాలో నిరసనలు పెల్లుబికాయి. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చిన జనం… ట్రంప్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇక కాలిఫోర్నియా విలువలకు విరుద్ధమైన అనేక చర్యలను ట్రంప్ నిర్వహిస్తుండడంతో  యునైటెడ్‌ స్టేట్స్‌ నుంచి విడిపోవడానికి కాలిఫోర్నియా ఉత్సాహం చూపుతోంది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోయిన ‘బ్రెగ్జిట్‌’ పదం స్పూర్తితో కాలిఫోర్నియా వాసులు ‘కలెగ్జిట్‌’ అంటూ నినాదాలు చేస్తున్నారు.  వేర్పాటు వాద విధానాలతో ముందుకు పోతున్న ట్రంప్ దెబ్బకి ఈ సారి కాలిఫోర్నియా పక్కకు తప్పుకోవడం ఖాయమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.