రెండాకులు హుళక్కేనా..?

0
70

Posted April 22, 2017 at 11:06

EC put conditions to panneerselvam and palaniswamy about AIADMK symbolవిలీనం కోసం కిందామీదా పడుతున్న అన్నాడీఎంకే వర్గాలు పన్నీర్, పళనిస్వామిలకు ఈసీ షాకిచ్చింది. జూన్ 16లోగా తగిన ఆధారాలు సమర్పించకపోతే రెండాకుల గుర్తు ఎవరికీ దక్కదని హెచ్చరికలు పంపింది. దీంతో ఒక్కసారిగా పన్నీర్ వర్గంలో కూడా భయం మొదలైంది. అనవసర డిమాండ్లతో విలీనంపై కాలయాపన చేస్తే.. అసలుకే ఎసరొచ్చేలా ఉందని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఏదో విధంగా పళనితో రాజీకి వచ్చేయడం మేలని పన్నీర్ పై కూడా ఒత్తిడి పెరుగుతుంది. కానీ పన్నీర్ మాత్రం ఆచితూచి వ్యూహాలు రచిస్తున్నారు.

పన్నీర్ పిలక కేంద్రం చేతిలో ఉందనేది బహిరంగ రహస్యమే. మోడీ, అమిత్ షా ఏం చెబితే ఆయన అదే చేయాలి. కానీ పన్నీర్ డిమాండ్ల పేరుతో వ్యక్తిగత అజెండా తెరపైకి తెస్తున్నారని బీజేపీ నేతలకు అనుమానం రావడంతో.. ఈసీతో గేమ్ మొదలుపెట్టారని భావిస్తున్నారు. సెల్వం చెప్పినట్లు వింటే అంతా మంచే జరుగుతుందని, కాదంటే అసలుకే ఎసరు తప్పదని బీజేపీ అధిష్ఠానం నుంచి కూడా సంకేతాలందాయట. పన్నీర్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పళనిస్వామి గురించి చెప్పేదేముంటుంది.

ఇప్పటికే ఐటీ రెయిడ్స్ లో బుక్కైన పళనిస్వామి.. నోరు మెదిపే పరిస్థితి కూడా లేదు. ఏం మాట్లాడినా అరెస్ట్ భయం వెంటాడుతోంది. అందుకే కమిటీ ద్వారా విలీన చర్చలు జరుపుతున్న పళనిస్వామి.. తాను నోరు తెరిచి ఒక్క ముక్క మాట్లాడటం లేదు. అటు ప్రతిపక్షం డీఎంకే కూడా మౌనమునిలా ఉంది. మామూలుగా అయితే ఇలాంటి పరిస్థితిని ఆసరాగా చేసుకుని స్టాలిన్ తెగ హడావిడి చేసేవారు. అయితే కేంద్రం నుంచి స్టాలిన్ కు కూడా సిగ్నల్ రావడంతో కామైపోయారు. అసలు కేంద్రం తమిళనాడును ఏం చేయాలనుకుంటుందో.. ఆ దేవుడికే తెలియాలి.