అబ్బే!! బిర్యానీ లో కల్తీ లేదు!!

Posted December 26, 2016

fake news about beryani
అన‌గ‌న‌గా ఓ న‌లుగురు స్నేహితులు. వాళ్లంద‌రికీ హైద‌రాబాద్ శాలిబండలోని షాగౌస్ హోటల్ కు వెళ్లి బిర్యానీ తిన‌డం అల‌వాటు. అయితే డిసెంబ‌ర్ లో ప్ర‌తిరోజూ హోట‌ల్ కు వెళ్లి బిర్యానీ తినాల‌ని ఆ బ్యాచ్ నిర్ణ‌యించుకుంది. అయితే అందులో ఒక స్నేహితుడికి ప్ర‌తిపాద‌న న‌చ్చ‌లేదు. ఎందుకంటే త‌న ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేదు. దీంతో ఎలాగైనా ఈ బిర్యానీ స్కెచ్ ను చెడ‌గొట్ట‌డానికి ఓ నాట‌కానికి తెర తీశాడు. ఆ నాట‌కంలో భాగంగానే బిర్యానీలో కుక్క మాంసం కలుపుతున్నారంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు స‌ద‌రు హోట‌ల్ కు సంబంధించిన ఫోటోల‌ను కూడా జ‌త చేశాడు. అంతే… ఇక ఈ వార్త ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది.

చివ‌ర‌కు ఛాన‌ళ్ల వ‌ర‌కు విష‌యం వెళ్ల‌డంతో అధికారులు స్పందించ‌క త‌ప్ప‌లేదు. షాగౌస్ హోట‌ల్ కు వెళ్లి శాంపిల్స్ ను సేక‌రించారు. చివ‌ర‌కు అలాంటిదేమీ లేద‌ని అధికారులు తేల్చారు. ఈ వివాదంలో హోట‌ల్ బిజినెస్ దెబ్బ‌తిన‌డంతో… యాజ‌మాన్యం సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అత‌గాడిని అరెస్ట్ చేశారు. మ‌నోడిని త‌మదైన స్ట‌యిల్ లో విచారించారు. ఇక అత‌ను చెప్పిన ఆన్స‌ర్ విని పోలీసుల‌కు కూడా దిమ్మ తిరిగిపోయింది. డ‌బ్బు లేకపోవ‌డంతో. బిర్యానీ అల‌వాటు మాన్పించాల‌ని ఇలా చేశాన‌ని చెప్పుకొచ్చాడు.

మొత్తానికి మ‌నోడు సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఒక్క పోస్టింగ్ ఎంత ప‌ని చేసిందంటే.. హైద‌రాబాద్ లోని హోట‌ల్స్ అన్నింటిలో బిర్యానీ సేల్స్ పై దెబ్బ ప‌డింది. బ‌డా బడా హోట‌ళ్ల‌లోనూ బిర్యానీ సేల్స్ కొంచెం త‌గ్గాయి. అయితే పోలీసులు చివ‌ర‌కు స‌ద‌రు వ్య‌క్తిని అరెస్ట్ చేయ‌డంతో ఇప్పుడు బిర్యానీ వ్యాపారులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక బిర్యానీ సేల్స్ ఊపందుకుంటాయ‌ని ఆశిస్తున్నారు. ఏది ఏమైనా మీడియాలో స‌ర‌దాగా చేసే కామెంట్స్ ఇంత ప‌ని చేస్తాయో.. ఈ ఉదంత‌మే ఒక ఉదాహ‌ర‌ణ‌