ఆలస్యమే అమృతం అంటున్న సెల్వం!!

Posted February 11, 2017

governor not take decision on tamil nadu cm Panneerselvam happy about that
అటు పన్నీర్ సెల్వం ఇటు శశికళ వర్గాలు గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి తమ వాదనను వినిపించాయి. అయితే గవర్నర్ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు. ఈ నిర్ణయాన్ని వెంటనే చెబితే బావుంటుందని శశికళ వర్గం అనుకుంటోంది. అయితే పన్నీర్ సెల్వం వర్గం మాత్రం తాత్సారం జరగాలని కోరుకుంటోంది.

గవర్నర్ ఇప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. పన్నీర్ సెల్వం కు కొంచెం కష్టం. ఎందుకంటే ఆయన వెంట తగినంత ఎమ్మెల్యేలు లేరు. డీఎంకే మద్దతిస్తే తప్ప ఆయన గట్టెక్కే అవకాశం లేదు. దీంతో ఆయన శశికళ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలను లాగే ప్రయత్నంలో ఉన్నారు. అయితే అనుకున్నంత వేగంగా జరగడం లేదు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సెల్వం దరికి చేరుతున్నారు. కాబట్టి తనకు ఎమ్మెల్యేల సపోర్ట్ రావడానికి ఇంకా టైమ్ పడుతుంది. అందుకే ఎంత ఆలస్యమైతే అంత మంచిదని సెల్వం భావిస్తున్నారు. మరో వారం రోజుల పాటు నిర్ణయం పెండింగ్ లో ఉంటే.. శాసనసభ్యుల మద్దతు పొందడం ఈజీ అని ఆయన ఆలోచన.

అటు శశికళ మాత్రం గవర్నర్ నిర్ణయం వెంటనే రావాలని కోరుకుంటోంది. గవర్నర్ వెంటనే నిర్ణయం ప్రకటిస్తే.. శశికళ తర్వాత ఎత్తుగడకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆమె దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలామందే ఉన్నారు. అంతమందితో ఆమె ఏదైనా చేయగలదు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. కుదరకపోతే సెల్వం ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశముంది. అందుకే ఏదైనా త్వరగా జరగాలని ఆమె కోరుకుంటోంది. ఆలస్యమైతే ఎమ్మెల్యేల చేజారే ప్రమాదముందని చిన్నమ్మ భయం.

మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం ఇంకా వేచిచూసే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో కొన్నికొన్ని సార్లు ఏ నిర్ణయం తీసుకోకపోవడం కూడా నిర్ణయమే. ఇప్పుడు సెల్వంకు ఇదే అన్ని రకాలుగా కలిసి వస్తోంది.