కేసీఆర్ కే షాకిచ్చిన హరీశ్ రావు

Posted December 1, 2016

Image result for harish rao and kcr relation
పెద్ద నోట్లు రద్దు నిర్ణయంపై మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా… ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ రూటు మార్చారు. ఏకంగా ఢిల్లీకి వెళ్లి మోడీతో భేటీ అయ్యారు. ఒక అడుగు ముందుకేసి పీఎం మోడీసారుకు సలహాలు కూడా ఇచ్చారు. దీనికి మోడీ నుంచి సానుకూల స్పందన రావడంతో కేసీఆర్ లో ఒక్కసారిగా మార్పు వచ్చేసిందట. ఢిల్లీ పెద్దోళ్లు… తమ మాటను కూడా వింటున్న తరుణంలో ఇక కేంద్రంతో కయ్యానికి దిగొద్దని డిసైడయ్యారట. అంతేకాదు ఇదే విషయాన్ని పార్టీలోని నాయకులకు చెప్పేశారట. ఎవరూ నోట్ల రద్దుపై విమర్శలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఎలాగూ కేసీఆర్ నుంచే ఆదేశాలొచ్చాయి కాబట్టి ఎలాగూ ఎవరూ ఆయనతో విభేదించే సాహసం కలలో కూడా చేయలేదు. ఇక ముందు కూడా చేయరు అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కనాయకుడు మాత్రం కేసీఆర్ కే షాకిచ్చారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలను లెక్కచేయకుండా బహిరంగంగా నోట్ల రద్దుపై మాట్లాడిన వ్యక్తి మరెవరో కాదు. హరీశ్ రావు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న హరీశ్… కేంద్రం నిర్ణయంపై నిర్మొహమాటంగా మాట్లాడారు. తనలోని కడుపుమంటను కుండబద్దలు కొట్టారు. పెద్దనోట్ల రద్దు రాష్ట్ర అభివృద్ధికి శరాఘాతంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టానికి కొత్త ప్రాజెక్టులు రావడం లేదన్న హరీశ్….. వచ్చిన ప్రాజెక్టుల్లో పనులు నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు. ఇలాగైతే ఇక ముందు కష్టమేనంటూ తాను చెప్పాల్సిందంతా చెప్పేశారు.

కేసీఆర్ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వరిస్తున్న హరీశ్… ఈ విధంగా మాట్లాడ్డం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆదేశాలను ధిక్కరించి మరీ..మాట్లాడ్డం వెనక ఏదైనా పెద్ద కథే ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.