చెన్నైలో హై అలర్ట్!!

Posted February 13, 2017

high alert in chennai
సహనానికీ ఓ హద్దుంటుంది..!! నేనూ సింహాన్నే…!! అంటూ శశికళ వ్యాఖ్యానించడంతో చెన్నైలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మన్నార్గుడి మాఫియా ఏమైనా కుట్రలు చేసే అవకాశముందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఏం జరిగినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉంది.

అటు పన్నీర్ సెల్వం బలం రోజురోజుకు పెరిగిపోతుండడంతో… మన్నార్గుడి మాఫియా మరో ఆలోచన చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం లభించకపోవడంతో వారిలో అసహనం పెరుగుతోందని టాక్. శశికళకు కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారట. వారి కౌన్సెలింగ్ తోనే చిన్నమ్మ కూడా ఇక తెగిద్దామనే డిసైడ్ అయ్యిందని తెలుస్తోంది.

శశికళ వాయిస్ పెరిగిన తరుణంలో చెన్నైలో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. నగరంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. చెన్నైలోని బ్రాడ్‌వే, ప్యారీస్‌ కార్నర్‌, ట్రిప్లికేన్‌, రాయపేట, వడపళని తదితర ప్రాంతాలన్నీ పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. నగరంలోని హోటళ్లు, పెద్దపెద్ద భవంతులు, కల్యాణ మండపాలలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.అసాంఘిక శక్తులు విధ్వంసానికి దిగే అవకాశాలున్నాయన్న ఇంటలిజెన్స్ రిపోర్ట్ తో అణువణువూ గాలిస్తున్నారు. నగరంలోకి దాదాపు వెయ్యి మంది వరకూ అసాంఘిక శక్తులు చొరబడ్డాయని ప్రచారం జరుగుతోంది. పోలీసులు 100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల పన్నీర్‌సెల్వం, శశికళ మద్దతుదారులు ఘర్షణలకు దిగారు. దీంతో శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని అన్ని జిల్లాల పోలీసు యంత్రాంగాలను డీజీపీ రాజేంద్రన్‌ ఆదేశించారు. జల్లికట్టు ఉద్యమంలో చివరిరోజు చోటుచేసుకున్న అల్లర్ల తరహాలో కుట్రకు అవకాశాలున్నాయని తేలడంతో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఒకవేళ కోర్టు తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే… ఆమె వర్గంలోని అసహనం..హింసగా మారడం ఖాయమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో… చూడాలి!!