హైదరాబాద్ బిర్యానీపై కుట్ర!!

Posted December 15, 2016

hyderabad beryani risk
హైదరాబాద్ బిర్యానీపై కుట్ర జరుగుతోందా? మెనూ కార్డులోంచి బిర్యానీని పూర్తిగా తీసేయడానికి ఎవరైనా స్కెచ్ వేస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు బిర్యానీ లవర్స్. మా మంచి బిర్యానీకి ఎవరో దిష్టి పెట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్ బిర్యానీకి ఎంతో హిస్టరీ ఉంది. శతాబ్దాల నుంచి హైదరాబాద్ మెనూలో ఇది భాగమైపోయింది. అంతేకాదు సిటీకి వచ్చిన వారెవరైనా ఇక్కడ బిర్యానీని ఆరగించకుండా వెళ్లరు. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీ టేస్టే వేరు. దేశంలో అన్ని చోట్లా బిర్యానీ దొరికినా.. భాగ్యనగరంలో చేసే బిర్యానీయే ఎక్కువ నోరూరిస్తుందట. ఎక్కడ తిన్నా.. ఇక్కడి టేస్ట్ రాదంటారు చాలామంది. అంతగా హైదరాబాద్ సంస్కృతిలో భాగమైపోయింది బిర్యానీ.

హైదరాబాద్ కు ఈ మధ్య ఫారిన్ నుంచి కొత్త వంటకాలొచ్చాయి. కానీ అవేవీ బిర్యానీని బీట్ చేయలేకపోయాయి. అందుకే సదరు వంటగాళ్లు… బిర్యానీని వెనక్కు నెట్టేయడానికి కుట్రలు చేస్తున్నారట. అందులో భాగంగానే కుక్క మాంసంతో బిర్యానీ చేస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల కొన్ని హోటల్స్ లో అధికారులు కూడా అకస్మాత్తుగా దాడులు నిర్వహించి బిర్యానీ శాంపిల్స్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చూసే అధికారులు ఈ దాడులు నిర్వహించారని సమాచారం.

హైదరాబాద్ లోని బిర్యానీ లవర్స్ ఈ దాడులపై మండిపడుతున్నారు. సిటీలోని హోటల్ బిజినెస్ నడిచేదే బిర్యానీ వల్ల. అలాంటిది కావాలని ఎవరు ఇలాంటివి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా బిర్యానీ ఇమేజ్ ను దెబ్బతీయడానికేనంటున్నారు చాలామంది. అయితే ఎన్ని కుట్రలు జరిగినా హైదరాబాద్ బిర్యానీ ఇమేజ్ కు ఒక్క పర్సెంట్ కూడా నష్టం జరిగే అవకాశం లేదంటున్నారు ఇక్కడి జనం.