టెస్ట్ లో ప్రతాపం చూపిన భారత్ బౌలర్లు ..పార్థివ్ రికార్డు

Posted November 26, 2016

Image result for india vs england 3rd test match

ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌ మొదటి రోజు ఆటలో టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొన్న ఇంగ్లాండ్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ (9) జట్టు స్కోరు 32 వద్ద ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న అజింక్య రహానెకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ సైతం 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో కీపర్‌ పార్థివ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న జోరూట్‌ (15)ని జయంత్‌ యాదవ్‌ ఎల్బీగా, మొయిన్‌ అలీ (16)ని షమీ పెవిలియన్‌కు పంపించారు. టాప్‌ ఆర్డర్‌ నిష్క్రమణతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాల్సిన బాధ్యత వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో (89), జోస్‌ బట్లర్‌ (43; 80 బంతుల్లో 5×4) మీద పడింది. శతకం దిశగా సాగిపోతున్న బెయిర్‌ స్టోను జయంత్‌ యాదవ్‌ ఎల్బీగా, బట్లర్‌ను జడేజా ఔట్‌ చేశారు. ఆ తర్వాత 8 పరుగులకే క్రిస్‌వోక్స్‌ (25; 70 బంతుల్లో 3×4)ను జట్టు స్కోరు 266 వద్ద ఉమేశ్‌ యాదవ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు 268/8 పరుగులతో నిలిచింది.

Image result for india vs england 3rd test match parthiv patel

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న పార్ధివ్ పటేల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.పార్ధివ్, టెస్టుల్లో 50 మందిని ఔట్ చేసిన వాడిగా నిలిచాడు. దీంతో యాభై కన్నా ఎక్కువ మందిని ఔట్ చేసిన 8వ భారత వికెట్ కీపర్‌గా అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. కుక్‌ను ఔట్ చేసిన తర్వాత స్టోక్స్‌ను స్టంపింగ్ చేసిన పార్ధివ్ ఇప్పటి వరకు మొత్తం మీద 42 క్యాచ్‌లు అందుకుని 9 స్టంపౌట్‌లు చేశాడు. 8 సంవత్సరాల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన మొదటి భారత క్రికెటర్‌‌గా కూడా పార్ధివ్ నిలిచాడు.