దుమ్ము రేపిన భారత్‌ 1 -0 తో ఘన విజయం…

Posted November 21, 2016

india vs england visakhapatnam test match won by india
విశాఖ తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చిన టెస్ట్‌మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌మ్యాచ్‌లో భారత్‌ 246 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం, రెండో ఇన్నింగ్స్‌లో కీలక అర్థశతకం సాధించిన కెప్టెన్‌ కోహ్లి తన 50 టెస్ట్‌ను మధురానుభూతిగా మిగుల్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి మ్యాన్‌ ఆప్‌ ద మ్యాచ్‌ అందుకోవడం మరో విశేషం. రవిచంద్రన్‌ అశ్విన్‌ 8 వికెట్లు( తొలి ఇన్నింగ్స్‌ 5, రెండో ఇన్నింగ్స్‌ 3) తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రాజ్‌కోట్‌లో జరిగిన తొలిటెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తక్కువ స్కోరుకే ఓపెనర్లు ఔట్‌ కావడంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను పూజారా(119), కోహ్లి(167) తీసుకున్నారు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 226 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత అశ్విన్‌(58) రాణించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే ఆలౌటైంది. రూట్‌953), స్టోక్స్‌(70), బెయిర్‌స్టో(53) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగుల ఆధిక్యాన్ని, అనంతరం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌటై 405 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లీష్‌ జట్టు ముందు ఉంచింది. కెప్టెన్‌ కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లోనూ 81 పరుగులు సాధించాడు ..

india vs england visakhapatnam test match won by india
ఇంగ్లండ్‌ ఆది నుంచీ ఆత్మరక్షణతో ఆడింది. ఎలాగూ గెలుపొందే అవకాశం లేకపోవడంతో కనీసం డ్రా అయినా చేద్దామన్న ఉద్దేశంతో ఆ జట్టు ఓపెనర్లు మరీ నెమ్మదిగా ఆడారు. వీరిద్దరూ 50 ఓవర్లలో 75 పరుగులు, నాలుగోరోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా.. కుక్‌(54), హమీద్‌(25) వికెట్లను ఇంగ్లండ్‌ చేజార్చుకుంది. ఇక ఐదోరోజు భారత స్పిన్నర్ల విజృంభించడంతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ వచ్చినవారు వచ్చినట్లే పెవిలియన్‌కు చేరారు. దీంతో 158 పరుగులకు ఆ జట్టు ఆలౌటైంది

మూడో టెస్టు నవంబరు 26 నుంచి 30 వరకు మొహలీ వేదికగా జరగనుంది