సిరీస్ కోహ్లీ సేనదే ..

 india won 3rd test match

వెస్టిండీస్‌పై భారత జట్టు మూడో టెస్టులోవిజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి టెస్టులో గెలిచి, రెండో టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మూడో టెస్టులో 237 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో రోజు వర్షం కారణంగా ఆట రద్దయినా మ్యాచ్‌పై భారత్‌ పట్టువదల్లేదు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆదిలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో అశ్విన్‌, సాహాలు అద్భుత శతకాలతో రాణించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 225 పరుగులకు కట్టడి చేయడంతో 128 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్‌ పూర్తిగా ఆటపై పట్టు సాధించి రెండో ఇన్నింగ్స్‌ను 217/7కు డిక్లేర్డ్‌ చేసి 346 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శనతో 108 పరుగులకే కుప్పకూలడంతో విజయం భారత్‌ సొంతమైంది. భారత బౌలర్లలో షమి 3, ఇషాంత్‌ 2, జడేజా 2, అశ్విన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ చెరో వికెట్‌ తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం సాధించిన అశ్విన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది.