జగన్ మౌనరాగం ఎందుకు?

Posted November 11, 2016

jagan doesnt talk about 500 and 1000 rs notes banned
500 ,1000 నోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఎంత సంచలనానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏ ఇద్దరు ఒక చోట చేరినా ఇదే టాపిక్ నడుస్తోంది. రాజకీయనేతలు కూడా ఈ పరిణామం మీద తమతమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.వైసీపీ తరపున ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తాం అని ప్రకటించారు.మరో వైపు ఈ పరిణామం తో వైసీపీ అధినేత జగన్ భారీగా నష్టపోతారంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం చూస్తూనే వున్నాం. జగన్ కి పాపం ఇబ్బంది అంటూనే తెలుగు తమ్ముళ్లు సెటైర్లు పేలుస్తున్నారు.ఇక సోషల్ మీడియా లోనూ జగన్ కి రివర్స్ ఓదార్పు యాత్ర అంటూ ఫోటోలు,పోస్టింగ్ లు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి.

ఇంత జరుగుతున్నా వైసీపీ అధినేత జగన్ ఈ అంశం మీద ఇప్పటిదాకా నోరు తెరవలేదు.అయన పేరుతో ఓ ప్రకటన కూడా విడుదల కాలేదు.ప్రస్తుతానికి జగన్ మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు.నిజంగా మోడీ నిర్ణయం వల్ల నష్టం జరిగినా..లేకున్నా ఓ పార్టీ అధినేత పాత్రని నిర్వహిస్తూ అయన తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే బాగుండేది.దీంతో అనవసర విమర్శలకి,లేనిపోని సందేహాలకు తావివ్వకుండా అవకాశముండేది.కానీ జగన్ మౌన రాగం వల్ల ఆయనకే ఓ నష్టం జరుగుతోంది. అయన మౌనం వస్తున్న విమర్శలు,చేస్తున్న హేళనలకి అర్ధాంగీకారం అనుకోవాల్సి వస్తుంది.పైగా ఓ సారి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాక ..మనసులో ఏమున్నా లేకున్నా ఆ పాత్రని సమయానికి తగ్గట్టు పోషించాల్సిందే..ఇప్పటికైనా జగన్ మౌనాన్ని వీడితే బాగుంటుంది.