జగన్ తో డిగ్గీ రహస్య భేటీ?

 Posted November 4, 2016

Jagan secret meeting with digvijay
2019 నాటికి పిల్ల కాంగ్రెస్,తల్లి కాంగ్రెస్ జంట ప్రయాణం చేస్తాయని వస్తున్న వార్తలు నిజమే అనిపిస్తోంది.ఈ మేరకు 10 జన్ పథ్ సందేశాన్ని మోసుకొచ్చిన డిగ్గీ రాజా జగన్ సన్నిహితులతో సమావేశం అయినట్టు తెలిసిన విశ్వసనీయ సమాచారాన్ని తెలుగు బులెట్.కామ్ అందించిన కొద్ది సేపటికే టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఓ బాంబు పేల్చారు.జగన్,దిగ్విజయ్ నేరుగా విమానాశ్రయ ప్రాంగణంలో రహస్యంగా చాలాసేపు మాట్లాడుకున్నారని గాలి చెప్పిన మాటల సారాంశం.అయితే ఆ చర్చల రహస్యాన్ని బయట పెట్టాలని గాలి డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ,వైసీపీ ని ఒకే వేదిక మీదకి తెచ్చే భాధ్యతను 10 జన్ పథ్ సీనియర్ నేత కేవీపీ కి అప్పజెప్పింది.అయన ప్రాధమిక స్థాయిలో జరగాల్సిన పనులు పూర్తి చేసాక డిగ్గీ రంగంలోకి దిగారన్న అంచనాలు కాంగ్రెస్ నేతలే వ్యక్తపరుస్తున్నారు.ఇటీవల ఆంధ్రాకి చెందిన కొందరు హస్తం నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మళ్లీ పార్టీకి పూర్వవైభవం వస్తుందని అనుచరులకు భరోసా ఇస్తున్నారు. ఏపీ లో ఆ పార్టీ నేతలు చురుగ్గా వ్యవహరించడానికి ఇదే ఆశ ఊపిరి పోస్తోంది.ఏదేమైనా కాంగ్రెస్,వైసీపీ ని కలిపేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఏపీ రాజకీయాల్ని ఇంకో మలుపు తిప్పుతాయనడంలో సందేహం లేదు.