టీడీపీ మంత్రుల‌తో జ‌గ‌న్ చెట్టాప‌ట్టాల్!!

Posted December 10, 2016
jagan talking tdp ministers in plane at gannavaram airport

తెలుగుదేశం, వైసీపీ మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. టీడీపీకి చెందిన‌ కీల‌క నాయ‌కులు.. జ‌గ‌న్ మ‌ధ్య డైలాగ్ వార్ న‌డుస్తోంది. రెండు గ్రూపులు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ త‌రుణంలో ఒక సంఘ‌ట‌న రెండు గ్రూపుల్లోని నాయ‌కుల అంత‌రంగాన్ని బ‌య‌ట‌పెట్టింది. ముఖ్యంగా మంత్రుల పేరు చెబితేనే జ‌గ‌న్ ఒంటికాలి మీద లేస్తారు. మాట‌లే త‌ప్ప చేసిందేమీ లేదంటూ క‌డిగి పారేస్తారు. అలాంటి ఆయ‌న మంత్రుల‌తో క‌లివిడిగా మాట్లాడారు. అదేంటి అనుకుంటున్నారా.. మీరు విన్న‌ది నిజ‌మే.

హైద‌రాబాద్ నుంచి విజయ‌వాడ గ‌న్నవ‌రం ఎయిర్ పోర్టుకు ఓ విమానం టేకాఫ్ కావ‌డానికి రెడీగా ఉంది. అందులో సాధార‌ణ జ‌నంతో వీఐపీలు కూడా ఉన్నారు. ఆ వీఐపీల్లో మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, ఇత‌ర‌ అధికార పార్టీ కీలక నాయకుల‌తో పాటు జ‌గ‌న్ కూడా ఉన్నారు. ఇక్కడే ఓ త‌మాషా జ‌రిగింది. యాదృచ్చికంగానే జ‌గ‌న్ ప‌క్క సీటు అచ్చెన్నాయుడుకు వ‌చ్చింది. జ‌గ‌న్ వెనుక సీట్లలో కేఈ కృష్ణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావు కూర్చున్నారు. ముందేమో 20 సూత్రాల అమ‌లు క‌మిటీ ఛైర్మన్ సాయిబాబా సీటుంది. ఆశ్చర్యం ఏంటంటే అంద‌రికంటే ముందుగా జ‌గ‌న్ స్పందించారు. తొలుత సాయిబాబాను ప‌ల‌క‌రించారు. న‌వ్వుతూనే త‌మ పార్టీని ఏకిపారేస్తున్న తీరును గుర్తు చేశార‌ని స‌మాచారం. త‌ర్వాతి పుల్లన్నా… అచ్చెన్నా అంటూ ఆప్యాయంగా న‌మ‌స్కరించార‌ట జ‌గ‌న్. ఇంత‌లో పెద్దాయ‌న కేఈ జోక్యం చేసుకొని… ఏంటీ… కోస్తా, ఉత్తరాంధ్ర నాయ‌కులేనా… రాయ‌ల‌సీమ వ్యక్తిని ప‌ట్టించుకోవా అని న‌వ్వుతూనే సెటైర్ వేశార‌ట‌. దీనికి జ‌గ‌న్ వెంట‌నే బ‌దులిచ్చార‌ట‌. నేను చూడ‌లేద‌ని చెప్పుకొచ్చార‌ట‌. అంతేకాదు మీ అబ్బాయి హ‌రి ఎలా ఉన్నాడ‌ని కేఈని అడిగారట.

కేఈ కుమారుడికి హ‌రికి ఏం సంబంధం అనే క‌దా డౌటు. వీరిద్దరు క్లాస్ మేట్లు అని స‌మాచారం. ఈ విష‌యాన్ని జ‌గ‌నే.. కేఈకి చెప్పార‌ట‌. ఇలా విమానంలో ఉన్నంత‌సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నార‌ట మంత్రులు మ‌రియు జ‌గ‌న్. ఇది చూసి తోటి ప్రయాణికులంతా నివ్వెర‌బోయార‌ట‌. ఉద‌యం లేచింది మొద‌లు రాత్రయ్యే వ‌ర‌కు తిట్టిన తిట్టు తిట్టకుండా… నోటికొచ్చింది మాట్లాడే ఈ నాయ‌కుల మ‌ధ్య ఇంత అనుబంధం ఉందా అని ఆశ్చర్యపోయారు. అంతేకాదు రాజ‌కీయం అంటే ఇంతే క‌దా అని మ‌రికొంద‌రు స‌ర్దిచెప్పుకున్నారట.

మొత్తానికి అంద‌రూ తెలుసుకోవాల్సింది ఒక‌టి ఉంది. రాజ‌కీయం, వ్యక్తిగ‌త విష‌యాలు వేరువేరు. అయిన‌ప్పటికీ రాజ‌కీయాల్లో శాశ్వత శ‌త్రువులు, శాశ్వత మిత్రులు ఉండ‌ర‌నే నానుడి ఎలాగూ ఉంది. దీన్ని బ‌ట్టి ఈ సంభాష‌ణ‌ను పెద్దగా సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు రెండు పార్టీల నాయ‌కులు.