ఆ హత్యలు..జయ ఆస్తులకి మధ్య లింకేంటి?

0
118

Posted April 24, 2017 at 13:06

jayalalitha kodanadu estate nepal watchman killed
జయలలిత రాజకీయాలకే కాదు ఆస్తులకి కూడా వారసులెవరో తేల్చకుండానే కన్నుమూశారు. నేతలు ఆమె రాజకీయ వారసత్వం కోసం కొట్టుకుంటుంటే ..ఆమెకి సన్నిహితంగా మెలిగిన కొందరు అటు రాజకీయ వారసత్వంతో పాటు జయ ఆస్తుల మీద కూడా కన్నేశారు.ఇక బతికినప్పుడు జయకి దూరంగానే వున్న ఆమె బంధువులు కూడా ఆస్తుల రేసులోకి దూసుకొచ్చేశారు.జయకి వున్న స్థిర ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని ఓ అంచనా.ఆయాచితంగా వచ్చిపడుతున్న అంత సంపదని ఎవరు మాత్రం వద్దనుకుంటారు? అయితే ఆ ఆస్తుల కోసం మొదలైన వేట మాటలు,కోర్టు కేసుల దగ్గర ఆగిపోవడం లేదు.హత్యల దాకా వెళుతోంది.ఆస్తి పత్రాల దోపిడీ దాకా వెళుతోంది. అయితే ఇంత దురాగతానికి పాల్పడుతోంది ఎవరన్నది మాత్రం ఇప్పటిదాకా అంతుబట్టలేదు.

జయకి వున్న ఆస్తుల్లో కొడనాడు ఎస్టేట్ ప్రధానమైంది.ఆమెకి ఇష్టమైనది కూడా.ఎప్పుడు మనసు బాగా లేకపోయినా ఆమె ఇక్కడికొచ్చి సేదతీరి వెళ్లేవారు.ఈ ఎస్టేట్ కి 30 ఏళ్లుగా నేపాల్ కి చెందిన ఓం బహదూర్ కాపలాదారుగా ఉండేవాడు.గత రాత్రి గుర్తు తెలియని దుండగులు అతన్ని దారుణంగా చంపేశారు.అతనికి తోడుగా వున్న ఇంకో వాచ్ మెన్ ని తీవ్రంగా గాయపరిచి ఎస్టేట్ లో వున్న కొన్ని పత్రాలు దొంగిలించి వెళ్లారు.ఓ వారం కిందట చెన్నై శివార్లలోని సిరుతపుర్ బంగ్లాకి ఇలాగే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నిప్పు పెట్టి వెళ్లారు.కొన్ని కీలక పత్రాలు అందులో కాలిపోగా మరికొన్నిటిని దొంగిలించినట్టు తెలుస్తోంది.ఇవి కాకతాళీయంగా జరుగుతున్న సంఘటనలు కావని తెలుస్తోంది.దీని వెనుక జయ ఆస్తులు సొంతం చేసుకునే భారీ కుట్ర దాగి ఉందని అనుమానం వస్తోంది.హైదరాబాద్ లోని జయ గార్డెన్స్,చెన్నై లోని పోయెస్ గార్డెన్స్ విషయంలోనూ ఇలాంటి ఘటనలు జరగొచ్చన్న ఆందోళనతో పోలీస్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ హత్యలు,దోపిడీలు ఓ వ్యూహం ప్రకారం జరుగుతున్నట్టు పోలీసులు అనుమతినిస్తున్నా వాటి సూత్రధారులు గురించి స్పష్టమైన ఆధారాలు దొరక్క మౌనంగా వుంటున్నారు.క్రైమ్ థ్రిల్లర్ ని తలపిస్తున్న ఈ సస్పెన్స్ వీడితే జయ ఆస్తులు సరైనవాళ్ళకి చేరతాయి.