రణభేరి మోగించిన దీప ..టెన్షన్ లో చిన్నమ్మ

Posted January 17, 2017

jayalalitha niece deepa says in mgr birthday celebrations meet all aiadmk party leaders sasikala tension
అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ శతజయంతి వేడుకలు మొదలైన ఈ రోజే జయ మేనకోడలు దీప రాజకీయ రణభేరి మోగించారు.పెద్ద ఎత్తున మద్దతుదారులతో చెన్నై మెరీనా బీచ్ లో ఎంజీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి దీప వచ్చారు.అప్పటికే అక్కడ శశికళ వర్గపు నేతలు ఉండటంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పోలీసుల అప్రమత్తతతో ఆ వేడి తగ్గిందనుకునేంతలోనే దీప తన రాజకీయ రంగప్రవేశాన్ని నిర్ధారిస్తూ ఓ ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటిస్తానని …ప్రతి అన్నాడీఎంకే కార్యకర్తని కలుస్తానని,ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిపై పోరాడతానని దీప చెప్పారు.

తాజా పరిణామం ఊహించిందే అయినా చిన్నమ్మ శశికళ బాగా టెన్షన్ పడిపోయారట.దానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. దీప వెంట మెరీనా బీచ్ కి వచ్చినవారిలో 90 శాతం మంది అన్నాడీఎంకే కార్యకర్తలే నని ఇంటలిజెన్స్ వర్గాలు నివేదించాయట.ఇక రెండో కారణం …నిన్నమొన్నటి దాకా కొత్త పార్టీ పెడతానని చెప్పిన దీప ఇప్పుడు అన్నాడీఎంకే కార్యకర్తల్ని కలుస్తానని ప్రకటించడం.ఈ రెండు విషయాలు శశికళని కలవరపెడుతున్నాయి.ఇప్పటికే శశికళ సీఎం కావడం ఇష్టంలేని చాలా మంది నేతలు పన్నీర్ సెల్వం వెనుకనుంచి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు.అయితే సెల్వం డిఫెన్సివ్ ఆట తీరు నచ్చక అయోమయం లో పడ్డారు.అలాంటి వాళ్లంతా ఇప్పుడు దీప వెంట నడిచేందుకు రెడీ అవుతున్నారు.ఈ పరిస్థితి గమనించే కొత్త పార్టీ ఆలోచన పక్కన పెట్టిన దీప అన్నాడీఎంకే గురించి మాట్లాడుతోంది.వేగంగా మారుతున్న ఈ పరిణామాలతో శశికళ ఆత్మ రక్షణలో పడ్డారు.