రెడ్డిగారి వల్లే జయకు కష్టాలు…

Posted December 7, 2016

jayalalitha troubled by marri chenna reddy
జయలలితకు అక్రమాస్తుల కేసు నుంచి చివరకు విముక్తి లభించింది.. అప్పటికే ఆమె జైలులో ఉండాల్సి వచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో ఈ కేసు ఆమెను నీడలా వెంటాడింది. మాటిమాటికీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నిజానికి ఈ జైలు కష్టాలకు రెడ్డిగారే కారణమన్న వాదన ఉంది. ఆ రెడ్డి గారు మరెవరో కాదు.. కాంగ్రెస్ దిగ్గజం, తమిళనాడు మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి.

1991 లో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. పీవీ నరసింహారావు అప్పుడు దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. అదే సమయంలో తమిళనాడు గవర్నర్ గా మర్రి చెన్నారెడ్డి వచ్చారు. అంతే జయకు కష్టకాలం మొదలైంది. పాలనకు సంబంధించిన విషయాల్లో చెన్నారెడ్డి ఆమెను ఇబ్బంది పెట్టారు. ఇద్దరి మధ్య గ్యాప్ విపరీతంగా ఉండేది. దీంతో ఉప్పునిప్పులా మారిపోయారు జయ- చెన్నారెడ్డి. అదే సమయంలో ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుబ్రమణ్య స్వామి జయపై అవినీతి ఫిర్యాదు చేశారు. చెన్నారెడ్డికి అమ్మను ఇబ్బంది పెట్టడానికి వంక దొరికింది. అంతే విచారణకు అనుమతి కూడా ఇచ్చారు. అదే జయకు కష్టాలను తెచ్చిపెట్టింది.

మర్రి చెన్నారెడ్డి ఒకవేళ ఆ విచారణకు అనుమతి ఇచ్చి ఉండకపోతే పరిస్థితి ఇంకోలా ఉండేది. జయలలిత జైలుకు వెళ్లాల్సి వచ్చేది కాదంటారు ఆమె సన్నిహితులు. మర్రి చెన్నారెడ్డి వల్లే ఆమెకు జైలు కష్టాలొచ్చాయని ఇప్పటికీ చెబుతారు. జయకూడా చెన్నారెడ్డితో ఢీ అనకుండా… చాకచక్యంగా వ్యవహరిస్తే ఇలా జరిగేది కాదని కూడా పరిశీలకులు ఇప్పటికీ గుర్తు చేస్తారు.