జేసీ-కేఈ సేమ్ టు సేమ్!!

Posted December 25, 2016

jc ke same to sameఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు… డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి మ‌ధ్య ఎక్కువ సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే అప్పుడ‌ప్పుడు ఆయ‌న చంద్ర‌బాబుపై రుసరుస‌లాడుతుంటారు. బాస్ పై త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతారు. పనులు కావ‌డం లేదంటూ బ‌హిరంగంగానే మాట్లాడుతారు. తాజాగా మ‌రోసారి కేఈకి బాబుగారిపై కోప‌మొచ్చింది. ఎందుకంటే క‌ర్నూలు జ‌ల్లాకు ఏం కావాల‌ని అడిగినా… బాస్ ఆలోచిస్తున్నార‌ట‌. ప‌రిశ్ర‌మ‌లు పెట్టేందుకు పెట్టుబ‌డిదారులు ముందుకు వ‌చ్చినా ఎందుక‌నో ప‌ర్మిష‌న్ రావ‌డం లేదంటూ చెప్పుకొచ్చారు. జిల్లా అభివృద్ధి విష‌యంలో ఇంత బ‌హిరంగంగానే కేఈ మాట్లాడ్డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

టీడీపీ నేత‌లు కొంద‌రు కేఈ కృష్ణ‌మూర్తిని జేసీ దివాక‌ర్ రెడ్డితో పోల్చుతున్నారు. ఎందుకంటే జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా కేఈ లాగానే చంద్ర‌బాబుపై అప్పుడ‌ప్పుడు అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతూనే ఉంటారు. ఆయ‌న కూడా అభివృద్ధి విష‌యంలోనే బాబు ప‌నితీరుపై ఆవేద‌న చెందుతారు. ఈ మ‌ధ్య కూడా మ‌రోసారి అలానే మాట్లాడారు జేసీ దివాక‌ర్ రెడ్డి.

జేసీ-కేఈ మ‌ధ్య ద‌గ్గ‌ర పోలిక‌లున్నాయి. ఇద్ద‌రూ సీనియ‌ర్లే. బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కులే. ఇద్ద‌రు సీమ నుంచే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే చంద్ర‌బాబుపై ఈ ఇద్ద‌రి అసంతృప్తి విష‌యాన్ని పెద్ద‌గా సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదంటారు టీడీపీ నాయ‌కులు. ఎందుకంటే వారిద్ద‌రి మ‌న‌సులో ఏమీ ఉండ‌ద‌ట‌. ఏదో ఒక సంద‌ర్భంలో మాట్లాడిన మాట‌ల‌ను అంత సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.