ఆరనీకుమా ఈదీపం కార్తీక దీపం

Posted November 21, 2016

 

karteeka deepam

కార్తీకమాసంలో శివారాధనకు ఎంతటి ప్రాశస్త్యం ఉందో, విష్ణు ఆరాధనకూ అంతే విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తూ ‘దామోదరమావాహయామి’ లేదా ‘త్య్రయంబకమావాహయామి’ అని అంటారు. దామోదర నామం విష్ణు సంబంధమైనది. త్య్రయంబకుడు అంటే పరమశివుడు. ఈ నామాలు చెబుతూ తమ ఇష్ట దైవాలను ఆవాహన చేస్తారు. ఈ దీపకాంతులు మనలోని ఆత్మజ్యోతిని ప్రకాశింపజేసి, ఆధ్యాత్మిక సాధన సజావుగా సాగేలా ప్రోత్సహిస్తాయి. ఉపాసనా శక్తిని పెంచుకోవడానికి కార్తీక మాసం అనుకూలమైన సమయం. అలాగే శివ కేశవులు ప్రీతి కోసం దీపదానం చేస్తారు. నదీ ప్రవాహాల్లో అరటి దొప్పల్లో ఉంచిన దీపాలను వెలిగించి వదులుతారు.

ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు భాగాలు ఉంటాయి. ఉత్తరాయణం పుణ్యకాలమని చాలామంది అంటూంటారు. అయితే ఈ రెండూ వేటికవే విశేషమైనవి. దక్షిణాయణం ఉపాసనకు సంబంధించినది. అందులో వచ్చే కార్తీకం చాలా పవిత్రమైనది.

పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఈశ్వరుడు తేజోమయ మూర్తి. ఆయన కాంతి సోకినప్పుడు మనలోని అజ్ఞానాంధకారాలు తొలగిపోతాయి. ‘పరంజ్యోతి’ని ఆరాధన చేస్తున్నామనే అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపనం చేస్తుంది. దీపానికి అంతటి శక్తి ఉంటుంది. కార్తీకమాసం మొదటిరోజున దేవాలయాల్లో ఆకాశదీపం వెలిగిస్తారు. ధ్వజస్తంభానికి తాడుకట్టి, చిన్న పాత్రలో దీపం వెలిగించి పైకెత్తుతారు. ఆ దీపం ధ్వజస్తంభంపై వెలుగుతూ ఈశ్వరునికి ఉత్సవం నిర్వహిస్తుందనే భావనతో ఇలా చేస్తుంటారు.

ఈ మాసంలో ప్రతి రోజూ పర్వదినమే అయినా ప్రత్యేకమైన ఫలితాలను ఇచ్చే తిథులు కొన్ని ఉన్నాయి. వాటిలో భగినీ హస్తభోజనం, నాగుల చవితి, క్షీరబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. ఈ నెలలో ఉసిరి చెట్టు కింది చేసే వనభోజనాలకు ఎంతో విశిష్టత ఉంది. కార్తీకా మాసంలో నదీ స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది.