కార్తీక వనభోజన కథ మీకోసం …

Posted November 19, 2016

karthika vana bhojana story

కైలాసాన పాములోరు:

కార్తీక మాసం సందర్భంగా పట్టణాలలో వుండే ఒక ఊరివాళ్లంతా వనభోజనాలకు కలుస్తున్నారు.పాత సంగతులు గుర్తు చేసుకుంటున్నారు..కొత్త మార్పులపై చర్చించుకుంటున్నారు. అయితే అందరినీ ఒక్కటి చేసే ఇలాంటి సందర్భాలు కూడా కొందరి పటాటోపం చూపించే వేదికలవుతున్నాయి.దీంతో కలుస్తున్న ఉద్దేశం జావగారిపోతోంది …అలా జరక్కుండా ఉండాలంటే కార్యక్రమానికి ముందు ఈ కధని ఓ సారి వినిపించాడమో…లేక జిరాక్స్ తీసి పంచడమో చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది…కనీసం కొందరిలోనైనా ఓ మంచి ఆలోచన మొదలవుతుంది …

కార్తీక మాస వనభోజన మహోత్సవానికి స్వాగతం.. సుస్వాగతం.. కార్తీకం అనగానే నదీ స్నానాలు, దీపాల వెలుగులు, ఓం నమఃశివాయ అంటూ మహాదేవుని సంకీర్తనలు గుర్తుకొస్తాయి. ఆ సంబరాల మధ్య ఇలా మనం కలుసుకోనేలా చేసింది మన పల్లెటూరు. ఆ తల్లి బిడ్డలుగానే ఇక్కడికి వచ్చాం… అన్నట్టు మన ఊరికి, శివుడికి మధ్య కూడా ఓ బంధం ఉంది. అదేంటో చిన్న కథగా చెప్పుకొందాం.. నిత్యం దేవతలు, రుషులు, మహర్షులు.. ఇలా ఒకటేమిటి మొత్తం విశ్వమంతా కైలాసం ముందు మోకరిల్లుతుంది. ఆ త్రినేత్రుడి సాక్షాత్కారం కోసం జన్మ జన్మలుగా ఎదురు చూసేవారెందరో.. అడిగిందే తడవుగా ఆ భోళా శంకరుడు భక్త జనాన్ని ఆదుకుంటూనే ఉన్నాడు. వాళ్ల భక్తి సముద్రంలో ఓలలాడుతుంటాడు. ఇదంతా యుగయుగాలుగా చూస్తూ వస్తోంది ఆ ముక్కంటి మెడలోని పాము.

కైలాసానికి వచ్చిన వాళ్లంతా తనని ప్రత్యేకంగా గమనించడం దానికి అర్థమైంది. అసలు వీళ్లంతా వస్తోంది.. చూస్తోంది.. నమస్కరిస్తోంది.. నాకా? శివుడికా? అన్న అహం దానిలో మొదలైంది. శంకరుడి క్షణకాల దర్శనం కోసం వీళ్లంతా యుగయుగాలుగా పరితపిస్తున్నారు. అలాంటి ఈయన మెడలో నిత్యం కొలువుండే నేనెంత గొప్పదాన్నో అన్న ఆలోచన మొదలైంది ఆ పాముకి. ఆలోచించింది.. ఇంకా ఆలోచించింది. కైలాసాన్ని, శివయ్యను వదిలి తానే జనం దగ్గరకు వెళదామని నిర్ణయం తీసుకుంది. తానే వారిని ఉద్దరిద్దాం.. వాళ్లే తనని కొలుస్తాతారన్న భ్రమలో పొంగిపోయింది. నాకు దక్కాల్సిన గౌరవంలో శివయ్యకెందుకులే భాగం అనుకుంది. ఇంకెందుకు ఆలస్యం అని మనసుకు తోచినదాన్ని అమల్లో పెట్టింది. కైలాసాన్ని, కైలాస నాధుడ్ని వదిలి బయటకు వచ్చింది. ఓ దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటున్న ఓ ముని దగ్గరికి చేరింది. కళ్లు తెరిచిన ఆయన వినమ్రంగా నమస్కరించాడు. లోలోన పొంగిపోతూ పైపైకి సరిసరి అనుకుంటూ ముందుకెళ్లింది. అటుగా వస్తున్న ఓ బాటసారి కనిపించాడు.

అతను ఆ సర్పాన్ని చూడగానే భయంతో పరుగులు తీశాడు. అబ్బా ఇది కదా నా తడాఖా అనుకొని విర్రవీగింది. ఇంకా ముందుకెళ్లింది. కట్టెలు కొట్టుకుంటున్న ఓ గుంపు దగ్గరికెళ్లింది. వాళ్లంతా పని ఆపి దాన్ని చూశారు. కనుసైగలు చేసుకొని మూకుమ్మడిగా గొడ్డళ్లతో దాన్ని చంపడానికి పరిగెత్తుకొస్తున్నారు. ఇదేంటా అనుకుంటున్న పాముకి కాస్త ఆలస్యంగా విషయం అర్థమైంది. బతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది.. తాను చేసిన తప్పేమిటో.. తన స్థాయి ఏమిటో అర్థమైంది.. పశ్చాత్తాపంతో కైలాసనాధుడ్ని చేరుకుంది. క్షమాపణలడిగింది… చిరునవ్వుతో తనను దరికి చేర్చుకున్న ఆ నీలకంఠుడి గొప్పదనమేంటో స్వయంగా చవి చూసింది. ఇప్పుడు చెప్తున్నా… ఆ శివుడే మనం పుట్టినఊరు.. మనకి మూలం.. ఆ పామే మనం, మనబుద్ధి.. కాస్త ఎదగగానే, వేరు లోతు తెలియని కొమ్మల్లా… కొమ్మ ఊతం ఎరుగని ఆకుల్లా తెగ ఊగిపోతాం. ఊరుకన్నా గొప్ప అని భ్రమిస్తాం.. అది కొన్ని సందర్భాల్లో నిజమే అనిపించే సంఘటనలు జరగొచ్చు.. కానీ ఒక్కటి నిజం.. కాస్త నిదానంగా, నిఖార్సుగా, నిజాయితీగా ఆలోచిస్తే… ఆ మూలం విలువేంటో అర్థమవుతుంది. తప్పు తెలుసుకున్న పాముని శివుడి చేరదీసినట్టు, కన్నతల్లిలా మనల్నెప్పుడు ఆదరిస్తుంది మన పల్లె.

దాన్ని ఆరాధించడం, గౌరవించండం, బాగు చేయడం అన్నది మన సంస్కారాన్ని బట్టే ఉంటుంది. మూలాల్ని మరిచిపోకుండా మనం ప్రతి ఏటా ఇలా కలుసుకోగలగడం గొప్ప సంతోషం.. దేవుడిచ్చిన వరం.. అందరి సంస్కారం. సరదాగా వచ్చిన మీకు కాస్త గంభీరమైన విషయం చెప్పినట్టున్నాం… అయితే ఇదంతా మనల్నిఇక్కడ కలిసేలా చేసిన జన్మభూమి గొప్పతనాన్ని చాటడానికే…. ఆ తల్లి నీడలో మనమంతా చల్లగా ఉండాలని, ఆకాశమంత ఎదగాలని ఆశిస్తూ శెలవు..

–కిరణ్ కుమార్