మోడీని ఆకాశానికి ఎత్తేసిన‌ కేసీఆర్!

Posted December 17, 2016

kcr appreciated to modi in assembly meetings
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు సీఎం కేసీఆర్… నోట్ల ర‌ద్దుపై సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. అదే స‌మ‌యంలో ఇత‌ర పార్టీల స‌భ్యులు ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ మాట్లాడితే మాత్రం వెంట‌నే స్పందించారు. నోట్ల ర‌ద్దు చాలా మంచి నిర్ణ‌య‌మంటూ ఆయా పార్టీల స‌భ్యుల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

నిజానికి తొలిరోజు అసెంబ్లీ స‌మావేశాల‌ను చూసిన వారెవ‌రైనా సీఎం కేసీఆర్ తీరును చూసి ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. మోడీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం వ‌ర‌కు ఓకే గానీ… అదే ప‌నిగా మోడీ జ‌పం చేస్తూ క‌నిపించారు. బీజేపీ స‌భ్యులు కూడా అంత‌లా మాట్లాడ‌లేదేమో. మోడీది అసాధార‌ణ నిర్ణ‌య‌మంటూ తెగ మెచ్చుకున్నారు. మ‌రి క‌ష్టాల మాటేమిటి అని ప్ర‌శ్నిస్తే… క‌ష్టాలు కామ‌నేనంటూ చెప్పుకొచ్చారు.

తెలంగాణ సీఎం తీరు చూస్తుంటే…బీజేపీ పార్టీ ప్ర‌తినిధిలా మాట్లాడార‌ని ఇప్పుడు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎంత మోడీ అభిమాని అయితే మాత్రం మ‌రీ ఇంత‌గా ప్ర‌శంస‌లు అవ‌స‌ర‌మా అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అటు ఎంఐఎం కూడా ఇదే సందేహాన్ని వ్య‌క్తం చేసింది. కేసీఆర్ టోన్ మారిందంటూ అక్బరుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే ఎంఐఎం అలా అంటుంది అని కేసీఆర్ అనుకోలేదు. అందుకే వెంట‌నే క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు కేసీఆర్. మంచి నిర్ణ‌యం ఎవ‌రు తీసుకున్నా స‌మ‌ర్థిస్తాం… త‌ప్పులుంటే ఎత్తిచూపుతామంటూ పాత డైలాగునే కొట్టారు. మ‌రి కేసీఆరా … మజాకా!!! చూస్తుంటే టీఆర్ఎస్.. కేంద్రప్ర‌భుత్వంలో చేరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు విశ్లేష‌కులు.