కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్లతో దొంగాట‌!!!

Posted February 4, 2017

kcr sarkar cheating to telangana contract teachers
తెలంగాణ‌లో కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల‌తో టీఆర్ఎస్-కాంగ్రెస్ దొంగాట ఆడుతున్నాయి. కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల‌ను ప‌ర్మినెంట్ చేస్తానంటూ కేసీఆర్.. ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చారు. ఆ హామీని నిజం చేయాల‌ని యోచిస్తున్నారు. కోర్టులో కేసు వ‌ల్ల అది పెండింగ్ లో ప‌డిపోయిందని టీఆర్ఎస్ ప్ర‌చారం చేస్తోంది. కేసు వేసింది కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు కావ‌డంతో ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చ‌రర్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ ఆగిపోయిందని చెబుతోంది.

టీఆర్ఎస్ మాటల ప్ర‌భావ‌మో… మ‌రో కార‌ణ‌మో తెలియ‌దు కానీ కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్లు మ‌రో దారి లేక గాంధీ భ‌వ‌న్ ముందు ఆందోళ‌న‌కు దిగారు. కాంగ్రెస్ త‌మ పొట్ట‌కొడుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అస‌లు క్ర‌మ‌బద్ధీక‌ర‌ణ‌పై కాంగ్రెస్ స్టాండ్ ఏంట‌ని నిల‌దీశారు. ఇటు కాంగ్రెస్ మాత్రం టీఆర్ఎస్ కు ఈ విష‌యంలో చిత్త‌శుద్ధి లేద‌ని ఆరోపిస్తోంది. తమ నాయ‌కుడు వేసిన కేసుతో సంబంధం లేద‌ని చెబుతోంది. నిజంగా చిత్త‌శుద్ధి ఉంటే… కేసు ఒక లెక్కా అని స్ప‌ష్టం చేస్తోంది. దీంతో కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్లు ఇప్పుడు డైలామాలో ప‌డిపోయారు. అస‌లు త‌మ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ను అడ్డుటుందెవ‌రో తెలియ‌క త‌ల‌లు పట్టుకుంటున్నారు. గాంధీ భ‌వ‌న్ ముందు ఆందోళ‌న చేయ‌క‌పోయుంటే.. ఆ పార్టీ మ‌ద్ద‌తు ల‌భించేది. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. ఇటు టీఆర్ఎస్ ఏమో కేసును బూచిగా చూపిస్తోంది. ఈ దొంగాట‌లో తాము బ‌లైపోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయ పార్టీల ఉచ్చులో ప‌డితే ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అని ఆశ్చ‌ర్యపోతున్నారు.

అస‌లు క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌పై నిజంగా టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్లు చాలా మందే ఉన్నారు. అంత‌మందిని ప‌ర్మినెంట్ చేస్తే… నిరుద్యోగుల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అందుకే డైరెక్ట్ గా చెప్ప‌లేక‌.. కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల‌కు జీతాలు పెంచార‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఇంత‌కు ఏది నిజం ఏంటి… కేసీఆర్ ఆలోచ‌న ఏంటి… అన్న‌ది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.