విడాకులు ఇచ్చిన వాళ్ళతోనే మళ్లీ పెళ్లి ..

Posted February 13, 2017

kiran kumar reddy to join in congress again
ఒక్కసారి విడాకులు తీసుకున్న జంట మళ్లీ పెళ్లి చేసుకుంటే అది వింతే ..ఏపీ రాజకీయ చిత్రపటం మీద ఇప్పుడు అదే జరగబోతోంది.రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ మాటల్ని పూచిక పుల్లలా తీసిపారేసిన అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తన రాజకీయ భవిష్యత్ కోసం పాత పార్టీనే ఎంచుకున్నట్టు తెలుస్తోంది.2014 ఎన్నికల్లో జై సమైక్య ఆంధ్ర పార్టీ ఘోర పరాజయం పాలయ్యాక సైలెంట్ అయిపోయిన కిరణ్ దాదాపు ఏడాదిగా క్రియాశీల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తున్నారు.ఏ పార్టీలో చేరితే బాగుంటుందో అని పరిశీలించారు. బీజేపీ వైపు కిరణ్ కన్ను పడినా ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవని తొలిదశలోనే అర్ధమైంది.

ఇక టీడీపీ,వైసీపీ లు ఓ మాజీ ముఖ్యమంత్రిగా తనకు ఆ స్థాయి గౌరవం ఇచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది.ఇక ఉన్న ఒకే ఒక్క అవకాశం కాంగ్రెస్. ఆ పార్టీ కి కూడా ఏపీ లో పోయిన అస్తిత్వాన్ని మళ్లీ నిలబెట్టే స్థాయి ఉన్న నాయకుడు ఇప్పటిదాకా దొరకలేదు.చిరు ప్రజాకర్షణ పట్ల సానుకూలత ఉన్నప్పటికీ ఆయన రాజకీయ పోరాట పటిమపై నమ్మకం కుదరడం లేదు.ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్న్యాయం కోసం కాంగ్రెస్ వెదుకులాటలో కిరణ్ తీగ కాలికి చుట్టుకుంది.దీంతో రాహుల్ కి సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు ,కిరణ్ తో సంప్రదింపులు మొదలెట్టినట్టు తెలుస్తోంది.కిరణ్ నుంచి కూడా సానుకూల సంకేతాలు కనిపించడంతో ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమనిపిస్తోంది.

కిరణ్ రాజకీయ అన్వేషణలో మిగతా పార్టీల కన్నా కాంగ్రెస్ వైఖరే బాగుందని అర్ధమైందట. అటు కాంగ్రెస్ అధిష్టానానికి విభజన టైం లో కిరణ్ చెప్పినట్టే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దెబ్బ తింటుందని చెప్పిన విషయం గుర్తుకొచ్చిందట.అనుభవం అయితే కానీ తత్వం బోధపడదని పెద్దలు చెబుతారు.ఇప్పుడు కాంగ్రెస్,కిరణ్ విషయంలో అదే జరిగింది.ఏదేమైనా ఈ జోడి కుదిరితే విడాకులు తీసుకున్న జంట మళ్లీ పెళ్లి చేసుకున్నట్టే ..కాదంటారా ?