గులాబీకి ముళ్లున్నాయంటున్న హస్తం

0
76

Posted April 23, 2017 at 11:36

komatreddy threatens kcr and his governmentమా గులాబీకి ముళ్లే లేవు. మాది అందరి లాంటి గులాబీ కాదు. ఇదీ కేసీఆర్ మాట. ఏ గులాబీకైనా ముళ్లే ఉంటాయి. కానీ మీ గులాబీకి అంతకు మించి ఉన్నాయి. కావాలంటే నిరూపిస్తాం. దమ్ముంటే మమ్మల్ని జైల్లో పెట్టండి. ఇదీ కాంగ్రెస్ నేతల సవాల్. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. కాంగ్రెస్ నేతలు స్వరం పెంచుతున్నారు. ఇప్పటిదాకా గులాబీ బాస్ మాటలకు కౌంటర్ ఇవ్వడంలో తడబడ్డ కాంగ్రెస్ నేతలు.. ఈ మధ్యకాలంలో గట్టిగా స్పందిస్తున్నారు. అవసరమైతే ఉరిశిక్షకైనా రెడీ అంటున్న కోమటిరెడ్డి తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యారు.

తమ ప్రభుత్వంలో అవినీతి కాదని, అసలా వాసనే లేదని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటించారు. సామాన్యుల బతుకు బాగుచేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. విపక్షాలు అవినీతి ఉందని నిరూపించాలని సవాల్ చేశారు. ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే జైల్లో పడేస్తామన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు వేగంగా స్పందించారు. కేసీఆర్ క్యాబినెట్లో అవినీతి లేదని, ప్రభుత్వంలో కూడా అంత సీన్ లేదని, ఉన్నదంతా గులాబీ బాస్ కుటుంబంలో ఉందని దుమ్మెత్తిపోశారు.

రాష్ట్రంలో అమలొతున్న సంక్షేమ పథకాలు, కేంద్ర నిధులు ఇలా ఏ అంశంలో అయినా అవినీతి ఉందని నిరూపిస్తామని స్పష్టం చేశారు. దమ్ముంటే టీఆర్ఎస్ అగ్రనేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నేతలు ఇంత ధీమాగా ఎలా చెబుతున్నారు, అవినీతి మాట ప్రతిపక్షాల దగ్గరే ఉంది, క్షేత్రస్థాయికి వెళ్లిందా అనే ఆందోళన వారిలో మొదలైంది. అందుకే కేసీఆర్ కూడా విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా వరుస హామీలతో హోరెత్తిస్తున్నారనే వాదన కూడా ఉంది.