గులాబీకి ముళ్లు లేవంటున్న కేటీఆర్

0
78

Posted April 18, 2017

ktr about trs unityఅందరూ అనుకుంటున్నట్లుగా టీఆర్ఎస్ లో సీఎం కుర్చీ కోసం పోరాటాలు జరగడం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. ఇంకో పదేళ్లు కేసీఆరే సీఎంగా ఉంటారన్నారు. రాజకీయాల్లో 64 ఏళ్లంటే యంగేనని, తనకు తొందరలేదని చెప్పుకొచ్చారు. హరీష్ తో మంచి అవగాహన ఉందన్న కేటీఆర్.. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా మీడియా ఊహాగానాలు ఆపాలని, ఆధిపత్య పోరాటం లాంటి పదాలు వాడొద్దని హితవు పలికారు కేటీఆర్. తన జిల్లా సభలు కూడా యాదృచ్ఛికమేనని చెప్పారు.

తెలంగాణ సీఎంగా కేసీఆర్ అద్భుతాలు చేస్తున్నారని, ఆయన అందరి కంటే బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. కేసీఆర్ వేగాన్ని తాను, కవిత, హరీష్ అందుకోలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. అన్నివర్గాలకు పెద్దన్నగా, ఎవరూ అడగకముందే అన్నీ చేస్తున్న కేసీఆర్ మరో పదేళ్లు సీఎంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమౌతుందని హరీష్ చెప్పారు. విపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన పనిలేదని, తెలంగాణలో టీఆర్ఎస్ ను ఆపే శక్తి ఎవరికీ లేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

రిజర్వేష్లన బిల్లుపై అనవసర రాద్ధాంతం అక్కర్లేదని, ఎవరేమనుకున్నా అందరికీ న్యాయం చేస్తామన్నారు. అవసరమైతే కేంద్రంతో కూడా పోరాడతామని కేసీఆర్ చెప్పారని, ఇప్పటికే ఎన్డీఏకు అంశాల వారీగా మద్దతు ఇస్తున్నామని గుర్తుచేశారు కేటీఆర్. తన బలాలు, బలహీనతలేంటో తనకు తెలుసని,ఉద్యమంలో హరీష్ పాత్రపై కూడా సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ఒకరి బలాలు మరొకరికి తెలిసినప్పుడు ఇక ఆధిపత్యమనే మాటే ఉండదన్నారు. అందరం కేసీఆర్ నాయకత్వంలో సమన్వయంతో పనిచేస్తున్నామని, అది చూడలేకే కొందరు పనిగట్టుకుని పుకార్లు పుట్టిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్.